ఎస్వీఎస్ఎన్ వర్మను పార్టీ నుంచి తొలగించలేదు..
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు వర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ అని టీడీపీ పేర్కొంది. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను టీడీపీ కోరింది.
పిఠాపురం నేత ఎస్వీఎస్ఎన్ వర్మను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ఆ పార్టీ ప్రకటించింది. వర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ అని టీడీపీ వర్గాలు తెలిపాయి. పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ స్థానం నుంచి స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేసిన వెంటనే పిఠాపురంలో వర్మ అనుచరులు టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. టీడీపీ, జనసేన ఫ్లెక్సీలను తగులబెట్టారు. తమతో చర్చించకుండా పిఠాపురం సీటును జనసేనకు కేటాయించడంపై వర్మ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటున్న ఎస్వీఎస్ఎన్ వర్మను టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు వర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా వైరల్ అవుతున్న లెటర్ ఫేక్ అని టీడీపీ పేర్కొంది. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను టీడీపీ కోరింది. పొత్తులో భాగంగా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే.. సహకరించాల్సిన టీడీపీ నాయకులు వ్యతిరేకించడంపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం వర్మను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి సహకరించాలని.. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.