టీడీపీ, వైసీపీ దుష్ట పార్టీలు

ఏపీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ దియోధర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement
Update:2022-08-30 11:35 IST

Sunil Deodhar

టీడీపీ, వైసీపీల‌పై ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆ రెండూ దుష్ట పార్టీల‌ని పేర్కొన్నారు. 2024లో ఆ రెండింటితో పోరాడి సొంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి త‌ర‌చూ త‌న‌ను క‌లిసేందుకు అనుమ‌తి ఇస్తున్నార‌ని.. కాబ‌ట్టి ఆ రెండు పార్టీలూ ఒక‌టే అని వ‌స్తున్న వ్యాఖ్య‌ల‌కు త‌న కామెంట్ ద్వారా ఆయ‌న చెక్ పెట్టారు. మ‌రో అడుగు ముందుకేసి.. దుర్యోధనుడు త‌న‌ను కలిసేందుకు శ్రీ కృష్ణుడు చాలా సార్లు సమయం ఇచ్చాడని, చాలా సార్లు కలిశాడని, కానీ కురుక్షేత్రంలో కృష్ణుడు ధర్మం వైపే నిలుచున్నాడని పేర్కొన్నారు. జ‌న‌సేన పార్టీ త‌మ మిత్ర‌ప‌క్ష‌మ‌ని, త‌మ పొత్తు కొన‌సాగుతుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న ఎర్రకోట పై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన విధంగా దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న అవినీతి కుటుంబ పార్టీలకు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిరూపాల‌ని ఆయ‌న చెప్పారు. ఆ పార్టీల‌తో బీజేపీకి రాష్ట్రంలో ఎలాంటి పొత్తూ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామ‌న్నారు. భారతీయ జనతా పార్టీ విధి విధానాలను బిజెపి పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది కానీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్న రచయితలు కాదని ఆయ‌న చెప్పారు. 2024లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశ , మార్గం రెండూ స్పష్టంగా తమకున్నాయ‌ని తెలిపారు.

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన బీజేపీ ప‌దాధికారులు, జిల్లా అధ్య‌క్షులు, ఇన్‌చార్జిల స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోప‌క్క వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ పిలుపునిచ్చింది. ఏపీ ప్రభుత్వంతో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాబోమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని సోము వీర్రాజు అన్నారు.

Tags:    
Advertisement

Similar News