సీఎం జగన్ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న టీడీపీ, జనసేన!

చంద్రబాబుని ములాఖత్‌లో కలిసిన పవన్ కళ్యాణ్ వెంటనే టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించేశారు. కానీ.. వారాలు గడిచినా ఇంకా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయలేదు.

Advertisement
Update:2023-10-09 19:38 IST

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నట్లు గత కొన్ని నెలల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. అరెస్ట్‌కి ముందు చంద్రబాబు కూడా బహిరంగ సభల్లో ముందస్తు ఎన్నికలపై క్యాడర్‌ని అలెర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా ముందస్తుపై పలు సందర్భాల్లో మాట్లాడారు. అన్నింటికీ మించి సీఎం జగన్ గత వారం ఢిల్లీ పర్యటనకి వెళ్లి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవడం.. ఆ వెంటనే సోమవారం వైసీపీ ప్రతినిధుల సభని విజయవాడలో ఏర్పాటు చేయడంతో ముందస్తు ఎన్నికల ప్రకటన చేయబోతున్నట్లు అంతా ఊహించారు.

కానీ.. ఈరోజు ఆ ప్రతినిధుల సభలో మాట్లాడిన సీఎం జగన్ మార్చి- ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాంతో టీడీపీతో పాటు జనసేన పార్టీ కూడా ఊపిరి పీల్చుకుంది. దానికి కారణం ఇప్పటికిప్పుడు ఎన్నికలకి ఈ రెండు పార్టీలు సిద్ధంగా లేకపోవడమే!

చర్చ దశలోనే పొత్తు, సీట్ల పంపకాలు

చంద్రబాబుని ములాఖత్‌లో కలిసిన పవన్ కళ్యాణ్ వెంటనే టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించేశారు. కానీ.. వారాలు గడిచినా ఇంకా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయలేదు. దాంతో పొత్తు, సీట్ల పంపకంపై రెండు పార్టీలు ఇంకా అయోమయంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ బలహీనంగా ఉంది. కాబట్టి నేను పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని పెడన సభలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేశారు. దాంతో వైసీపీ నాయకులు.. బలహీనంగా టీడీపీకి ఎన్ని సీట్లని జనసేన ఇస్తుంది..? అని సెటైర్లు వేశారు.

చంద్రబాబు పాత్ర పోషించేది ఎవరు?

వాస్తవానికి చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నట్లయితే.. పొత్తు ప్రకటన వెలువడిన వెంటనే సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తుని మొదలుపెట్టేవారు. అతనికి ఉన్న అనుభవం, అవగాహన అలాంటింది. కానీ, ఇప్పుడు బాబు పాత్రని పోషించే నాయకుడి కోసం టీడీపీ, జనసేన అన్వేషిస్తున్నాయి. టీడీపీ నుంచి నారా లోకేష్‌కి అనుభవం లేదు.. ఇక పవన్ కళ్యాణ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఒకవేళ నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు తెరపైకి తెచ్చినా.. వారి మాట చెల్లుబాటయ్యే పరిస్థితి రెండు పార్టీల్లో లేదు. దాంతో పొత్తు వ్యవహారం ప్రకటన దగ్గరే ఆగిపోయింది.

జగన్‌కి ఆ పార్టీలు థ్యాంక్స్ చెప్పాలేమో!

ఒకవేళ సీఎం జగన్ ముందస్తుకి వెళ్లి ఉంటే..? తెలంగాణతో పాటు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలూ లేకపోలేదు. అప్పుడు నవంబర్‌ చివర్లో పోలింగ్.. డిసెంబరు 3న ఫలితాలు వచ్చేసేవి. కానీ.. కేవలం నెలన్నరలో టీడీపీ, జనసేన ఎన్నికలకు రెడీ అవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం అని చెపొచ్చు. అయితే వైసీపీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. గత కొన్ని నెలలుగా సీఎం జగన్ ముందు చూపుతో 175 నియోజకవర్గాల అభ్యర్థులపై ఐప్యాక్ టీమ్‌తో సర్వే చేయించి రెడీగా ఉన్నారు. కేవలం 20-25 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News