ఏపీలో కొత్త మిత్రులు.. టీడీపీ, కాంగ్రెస్ ఉమ్మడి నిరసనలు
కొత్తగా కాంగ్రెస్, టీడీపీ జెండాలు కలసి నిరసనల్లో కనపడటం కూడా ఊహించని పరిణామమే. ముందు ముందు ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.
2018 తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలసి పోటీ చేసినా ఆ పొత్తుల ప్రభావం ఏపీపై పడకుండా చూసుకున్నారు. ఏపీలో మాత్రం ఆ రెండు పార్టీలు పరస్పర వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి ఆ రెండు పార్టీల జెండాలు కలసి కనపడ్డాయి. ఇరు పార్టీల యూత్ వింగ్ నాయకులు కలసి నిరసనల్లో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.
ఏపీలో ఈరోజు నుంచి ఆడుదాం ఆంధ్రా ఆటల పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీల సందర్భంలో నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. 'అడుగుదాం ఆంధ్ర' పేరుతో వారు ఆందోళన చేపట్టారు. 'ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట' అంటూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని జాబ్ క్యాలెండరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చేయాలని వారు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. వీరి ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు, వారిని పోలీస్ స్టేషన్ కు తరిలించారు.
తెలంగాణలో కాంగ్రెస్ కి దగ్గరగా ఉన్న వైఎస్ షర్మిల ఇటీవల ఏపీలో టీడీపీ అధినేతలకు క్రిస్మస్ శుభాకాంక్షల సందేశం పంపించడం సంచలనంగా మారింది. టీడీపీతో షర్మిలకు ఈ కొత్త స్నేహం ఏంటని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్, టీడీపీ జెండాలు కలసి నిరసనల్లో కనపడటం కూడా ఊహించని పరిణామమే. ముందు ముందు ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.