బాబు అరెస్ట్ పై టీబీజేపీ మూకుమ్మడి స్పందన.. అసలేం జరిగింది..?

చంద్రబాబు అరెస్ట్ ని టీబీజేపీ మాజీ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఖండించారు. ఒక మాజీ సీఎంను ఆదరాబాదరా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారాయన.

Advertisement
Update:2023-09-14 16:36 IST

చంద్రబాబు అరెస్ట్ సరికాదంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించిన తర్వాత.. అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేసి ఉంటారన్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందన కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రోజు మూకుమ్మడిగా టీబీజేపీ నేతలు చంద్రబాబు అరెస్ట్, ఖైదు వ్యవహారంపై స్పందించారు. ఎక్కడలేని సానుభూతి చూపించారు. బాబు జైలుకెళ్లిన మూడు రోజుల తర్వాత ఈ సానుభూతి పవనాలు ఎందుకనేది తేలాల్సి ఉంది.

చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ నేతలు అస్సలు పట్టించుకోలేదు. ఇటు ఏపీలో కూడా పురందేశ్వరి బాధపడ్డారే కానీ, బీజేపీ నుంచి ఎవరూ పెద్దగా స్పందించలేదు. కాస్త ఆలస్యంగా తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబుకి సానుభూతి తెలపడమే ఇక్కడ విశేషం. చంద్రబాబుని అరెస్టు చేసిన విధానం సరైంది కాదన్నారు టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి పిలిచి ప్రశ్నించాల్సిందని ఆయన చెప్పారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి అరెస్టులోనూ దర్యాప్తు సంస్థలు ముందు విచారణ జరిపి తర్వాతే అరెస్ట్ చేశాయన్నారు.

చంద్రబాబు అరెస్ట్ ని టీబీజేపీ మాజీ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఖండించారు. ఒక మాజీ సీఎంను ఆదరాబాదరా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారాయన. జీ-20 సమావేశాల సమయంలోనే అరెస్టు చేయడానికి పోలీసులకు సమయం కుదిరిందా అని ప్రశ్నించారు. తాజా అరెస్టుతో ఏపీ ప్రజల్లో చంద్రబాబుకు మైలేజ్‌ వచ్చిందని అన్నారు. తప్పును తప్పు అని చెబితే చంద్రబాబు ఏజెంట్‌ అని ముద్ర వేసే దురలవాటు వైసీపీ నేతలకు ఉందని విమర్శించారు బండి.

Tags:    
Advertisement

Similar News