175/175 కుప్పంలో రచ్చ చేస్తున్న వైసీపీ..

కుప్పంలో 175/175 అనే పోస్టర్లు భారీగా వెలిశాయి. సీఎం జగన్ బొమ్మలతో 175/175 అనే నంబర్ తో సింపుల్ గా ఏపీలో సీన్ ఇలా ఉంటుందని తేల్చి చెబుతున్నారు వైసీపీ నేతలు.

Advertisement
Update:2022-09-22 11:51 IST

కుప్పంలో వైసీపీ రచ్చ మొదలైంది. రెండు రోజులపాటు సీఎం జగన్ పర్యటన ఉంటుందని అనుకున్నా చివరి నిమిషంలో అది ఒక రోజుకే పరిమితమైంది. శుక్రవారం ఒక్కరోజు జగన్ కుప్పంలో పర్యటిస్తారు. అక్కడినుంచే వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులు విడుదల చేస్తారు. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా జగన్ శంకుస్థాపన చేస్తారు.

ఉత్కంఠ..

కుప్పంలో ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆందోళనలు జరిగాయి. వైసీపీ జెండాలు, బ్యానర్లతో గొడవలు మొదలయ్యాయి. ఒకరి జెండాలు ఒకరు చించేయడం, ఒకరి బ్యానర్లు మరొకరు తీసేయడంతో పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల జగన్ పర్యటన సందర్భంగా కొంతమంది టీడీపీ నేతల్ని కూడా ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ దశలో జగన్ కుప్పంలో అడుగు పెడితే ఎలాంటి పరిణామాలుంటాయోనని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

175/175

కుప్పంతో సహా 2024లో ఏపీలోని అన్ని అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని ధీమాగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. కుప్పంలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడంతోనే ఆ అరుదైన ఫీట్ సాధిస్తామంటున్నారు. కుప్పంలో 175/175 అనే పోస్టర్లు భారీగా వెలిశాయి. సీఎం జగన్ బొమ్మలతో 175/175 - ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో సీన్ ఇలా ఉంటుందని తేల్చి చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇక కుప్పంలో జగన్ స్పీచ్ ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. తాజాగా ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారం కూడా సంచలనంగా మారడంతో సీఎం జగన్ కుప్పం మీటింగ్ లో ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. కుప్పంపై జగన్ వరాల జల్లు కురిపిస్తారని కూడా అంటున్నారు.

రేపు ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కి చేరుకుని అక్కడినుంచి కుప్పంకి బయలుదేరుతారు జగన్. 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15 నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభ ఉంటుంది. వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేసిన అనంతరం కుప్పం నియోజకవర్గ వైసీపీ నేతలతో జగన్ భేటీ అవుతారు. మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.

Tags:    
Advertisement

Similar News