Taraka Ratna Health Update: మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారక రత్న..!
Taraka Ratna Health Update: వైద్యులు తారకరత్న మెదడు స్కానింగ్ తీశారని, ఆ నివేదిక ఆధారంగా మెదడు పనితీరు తెలుస్తుందని చెప్పారు. వారిచ్చే నివేదిక ప్రకారం పరిస్థితిని బట్టి విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని అన్నారు.
తారకరత్నను వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్తున్నారా..?
బెంగళూరు ఆస్పత్రి నుంచి ఆయనను షిఫ్ట్ చేస్తున్నారా..?
కుటుంబ సభ్యులు ఆల్రడీ నిర్ణయం తీసేసుకున్నారా..?
వీటన్నిటికీ ఔననే సమాధానం చెబుతున్నారు హిందూపురం పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ. తారకరత్నను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని స్పష్టం చేశారు. అయితే ఎప్పుడు, ఎక్కడికి తీసుకెళ్తారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
టీడీపీ నాయకుడు లక్ష్మీనారాయణ ఈరోజు బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాకు వివరాలు తెలియజేశారాయన. వైద్యులు తారకరత్న మెదడు స్కానింగ్ తీశారని, ఆ నివేదిక ఆధారంగా మెదడు పనితీరు తెలుస్తుందని చెప్పారు. వారిచ్చే నివేదిక ప్రకారం పరిస్థితిని బట్టి విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారని అన్నారు లక్ష్మీనారాయణ. బాలకృష్ణ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఉన్నట్టు తెలిపారు.
తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించిన తర్వాత ఆస్పత్రి వర్గాలు రెండుసార్లు మాత్రమే హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చారు వైద్యులు. అయితే అంతకు మించి ఆరోగ్యం క్షీణించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఆయన పూర్తిగా కోలుకోడానికి మరికొన్నాళ్లు సమయం పట్టే అవకాశముందని అంటున్నారు. అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆయన్ను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.