6 నెలల్లో ఇల్లే కట్టలేం, రాజధాని ఎలా కడతారు..?

ఆరు నెలల్లో ఇల్లే కట్టలేం, ఇక రాజధాని ఎలా కడతామన్నారు స్పీకర్ తమ్మినేని. కానీ హైకోర్టు గడువు విధించి లక్ష్మణ రేఖ దాటిందని గుర్తు చేశారు.

Advertisement
Update:2022-11-29 12:35 IST

రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు కామెంట్ల నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. ఏపీలో రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన తీర్పు వచ్చిందని, న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ఈ తీర్పు మళ్లీ ఆ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేసిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమా లేక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా అంటూ హైకోర్టుని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనించాల్సిన విషయం అని పేర్కొన్నారు.

ఆరునెలల్లో ఇల్లే కట్టలేం..

ప్రభుత్వానికి హైకోర్టు 6నెలల గడువు విధించడం హాస్యాస్పదం అన్నారు తమ్మినేని. ఆరు నెలల్లో ఇల్లే కట్టలేం, ఇక రాజధాని ఎలా కడతామన్నారు. కానీ హైకోర్టు గడువు విధించి లక్ష్మణ రేఖ దాటిందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని.. శాసన, న్యాయ, కార్యనిర్వాహక సంస్థలకు దేనికదే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిందని గుర్తు చేశారు. తామే గొప్ప అనుకుంటే ప్రజలలో పలుచన అవుతామని అన్నారు స్పీకర్ తమ్మినేని. మూడు రాజధానుల కేసు సందర్భంగా హైకోర్టు ఓవర్ ల్యాప్ అయిందన్నారు.

ఆయనది పొలిటికల్ డ్రమటిక్ షో..

వికేంద్రీకరణపై యాగీ చేస్తున్న జనసేన, టీడీపీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపై క్లారిటీ ‌ఇవ్వాలన్నారు తమ్మినేని. రైతుల పేరుతో బినామీ యాత్రలు చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవిధంగా చేశారని మండిపడ్డారు. ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామన్న చంద్రబాబుది పొలిటికల్ డ్రమటిక్ షో అని ఎద్దేవా చేశారు. రాజధాని అనేది మూడు ప్రాంతాల మనోభావాలకు సంబంధించిందని పేర్కొన్నారు. తన‌ బినామీలతో భూములు కొనిపించి రేట్లు పెంచుకునే ప్రక్రియ చేపట్టారని, అదిప్పుడు తప్పని తేలిపోయిందని చెప్పారు.

సర్వోన్నత న్యాయస్థానానికి లోబడి ఉందాం..

హైకోర్టు తన పరిధి దాటిందని తాము ఆరోజే చెప్పామని గుర్తు చేశారు తమ్మినేని. మనమంతా సర్వోన్నత న్యాయస్థానానికి లోబడి ఉండాలన్నారు. ఎవరి పని వారు చేస్తే మంచిదని, లేకపోతే వ్యవస్థలో అరాచకం వస్తుందన్నారు తమ్మినేని. న్యాయ వ్యవస్థ విశ్వసనీయత గురించి తాము ప్రశ్నించడం లేదని, తమకు న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందన్నారు.

Tags:    
Advertisement

Similar News