అసెంబ్లీ స్పీకర్ గా పనిచేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదా..?

బొడ్డేపల్లి సత్యవతి వైసీపీ వైపు వస్తే కచ్చితంగా ఆముదాల వలస టికెట్ ఆమెకు ఖాయమవుతుంది. అంటే స్పీకర్ తమ్మినేనికి వైసీపీ హ్యాండిచ్చినట్టే చెప్పుకోవాలి.

Advertisement
Update:2023-08-26 14:02 IST

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి చిట్ట చివరి స్పీకర్ నాదెండ్ల మనోహర్. ఆ తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా మారిపోయిందో అందరికీ తెలుసు. ప్రస్తుతం జనసేనలో నెంబర్-2 స్థానంలో ఉన్నారని సరిపెట్టుకున్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన తంటాలు పడుతున్నారు. ఈసారి కూడా తెనాలిలో పోటీకి దిగుతున్నా.. మళ్లీ పూర్వ వైభవం మాత్రం ఆయనకు కష్టమేననే మాటలు వినపడుతున్నాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి స్పీకర్ గా పనిచేశారు కోడెల శివప్రసాద్. స్పీకర్ గా పనిచేసిన తర్వాతి ఎన్నికల్లోనే ఘోర పరాభవం ఎదురైంది. ఇతరత్రా సమస్యలతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన జీవితం అర్థాంతరంగా ముగిసింది. పోనీ ఆయన కుటుంబం అయినా పొలిటికల్ గా బాగుందా అంటే అదీ లేదు. ప్రస్తుతం కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాంను టీడీపీ దూరం పెట్టింది.

ఇక తాజా ఎపిసోడ్ కి వద్దాం. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పొలిటికల్ కెరీర్ పై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో తమ్మినేని పదవి ఆశించినా కుదర్లేదు, వచ్చే దఫా తన కొడుకుని తెరపైకి తేవాలని చూస్తున్న తమ్మినేనికి ఆ దిశగా అధిష్టానం నుంచి హామీ కూడా లభించలేదు. అసలిప్పుడు ఆముదాల వలస తమ్మినేని చేజారిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి కోసం సీఎం జగన్ వెదుకుతున్నారని తెలుస్తోంది.

బొడ్డేపల్లి వారసులకు వైసీపీ ఆఫర్..

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆముదాల వలస టికెట్ తమ్మినేనికి దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. బొడ్డేపల్లి రాజగోపాలరావు వారసులకు అక్కడ వైసీపీ టికెట్ దక్కుతుందని అంటున్నారు. రాజగోపాల్ కోడలు బొడ్డేపల్లి సత్యవతితో వైసీపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది. బొడ్డేపల్లి సత్యవతి వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. అయినా ఆమె కాంగ్రెస్ ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆమెను వైసీపీలోకి ఆహ్వానించబోతున్నారు. అందుకే ఇటీవల బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి వేడుకలను వైసీపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఆ కుటుంబ వారసులకు గేలమేస్తోంది.

బొడ్డేపల్లి సత్యవతి వైసీపీ వైపు వస్తే కచ్చితంగా ఆముదాల వలస టికెట్ ఆమెకు ఖాయమవుతుంది. అంటే స్పీకర్ తమ్మినేనికి వైసీపీ హ్యాండిచ్చినట్టే చెప్పుకోవాలి. ఒకవేళ సత్యవతి వైసీపీ వైపు చూడకపోయినా కూడా అక్కడ తమ్మినేనికి మాత్రం ఛాన్స్ లేదని అంటున్నారు. అంటే తాజా స్పీకర్ కి కూడా రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగానే ఉంది. 


Tags:    
Advertisement

Similar News