ఐయాం సారీ ఎమ్మెల్యే సార్..
ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మాత్రం పట్టుబట్టి సీఐతో సారీ చెప్పించుకుని తన పంతం నెగ్గించుకున్నారు. అస్మిత్ రెడ్డి, సీఐతో సారీ చెప్పించుకోడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.
తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నేతలు కూడా ఉన్నారనేది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. తాడిపత్రిలో 25 మంది టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారని చెప్పారాయన. నియోజకవర్గంలో మీరు మాత్రమే సంపాదించుకుంటే చాలా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న కొన్ని వాహనాలను జేసీ వర్గం పట్టుకుంది. ఆ వాహనాలను పోలీస్ స్టేషన్ కి తరలించి కేసులు పెట్టాలని జేసీ వర్గం డిమాండ్ చేసింది. స్వయంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన అనుచరుల్ని పోలీస్ స్టేషన్ కి పంపించారు. అక్కడే వ్యవహారం తేడా కొట్టింది. జేసీ వర్గం చెప్పినట్టల్లా తలాడించేందుకు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఒప్పుకోలేదు. కేసు పెట్టడానికి ఆయన ససేమిరా అన్నారు. దీంతో అస్మిత్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఇసుక అక్రమంగా తరలిస్తున్నవారిపై కేసులు పెట్టాలని ఎమ్మెల్యేగా తాను ఆదేశిస్తే సీఐ తన మాట వినలేదంటూ అస్మిత్ రెడ్డి రచ్చ రచ్చ చేశారు. తాడిపత్రి రూరల్ అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. సీఐ లక్ష్మికాంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి - కడప రోడ్ పై దాదాపు మూడున్నర గంటలు ట్రాఫిక్ ఆగిపోయేలా అస్మిత్ రెడ్డి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పినా ఆయన తగ్గేది లేదన్నారు.
చివరకు వీడియో కాల్ ద్వారా సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి సారీ చెబితే కానీ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి శాంతించలేదు. తాను చేసింది తప్పు అయితే, తప్పు అని ఎమ్మెల్యే అనుకుంటే ఆయన్ను క్షమాపణలు అడుగుతున్నానని వీడియో కాల్ లో చెప్పారు సీఐ. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా సిద్ధమేనని అన్నారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్టయింది. అయితే అస్మిత్ రెడ్డి, సీఐతో సారీ చెప్పించుకోడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. పోలీస్ అధికారుల విధుల్లో ఎమ్మెల్యే జోక్యం ఏంటని నిలదీస్తున్నారు. నిజాయితీగా అధికారుల్ని పనిచేసుకోనివ్వరా అని ప్రశ్నిస్తున్నారు. సమర్థులైన పోలీసుల్ని కూడా సారీ చెప్పాలని వేధిస్తే అది వారి పనితీరుపై ప్రభావం చూపదా అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మాత్రం పట్టుబట్టి సీఐతో సారీ చెప్పించుకుని తన పంతం నెగ్గించుకున్నారు.