ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? - స్వరూపానందేంద్ర ఆగ్రహం
దేవాదాయ భూములు ఇబ్బందుల్లో పడుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఉద్యోగుల సేవలు అవసరమేనని.. కానీ ఏం తెలుసని రెవెన్యూ శాఖ ఉద్యోగులను తీసుకొచ్చి ఆలయాలకు ఈవోలుగా నియమిస్తున్నారని ప్రశ్నించారు.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి కోపం వచ్చేసింది. ఏపీ దేవాదాయశాఖపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దేవాదాయ శాఖను రెవెన్యూ అధికారులు అక్రమిస్తున్నారని ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతర్గత కలహాలతో దేవాదాయ శాఖను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. దేవాదాయ భూములు ఇబ్బందుల్లో పడుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఉద్యోగుల సేవలు అవసరమేనని.. కానీ ఏం తెలుసని రెవెన్యూ శాఖ ఉద్యోగులను తీసుకొచ్చి ఆలయాలకు ఈవోలుగా నియమిస్తున్నారని ప్రశ్నించారు.
రెవెన్యూ ఉద్యోగులకు అసలు కైంకర్యాల అంటే ఏంటో తెలియని, శైవం అంటే తెలియదు, గ్రామ దేవతలంటే ఎవరో తెలియదని అలాంటి వారిని తీసుకొచ్చి ఈవోలుగా నియమించం అంటే అంత కంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. దేవాలయాలకు రెవెన్యూ ఉద్యోగులను ఈవోలుగా నియమించడం అంటే దాన్ని దేవాదాయశాఖ ఉద్యోగులు చేతగానితనంగానే భావించాల్సి ఉంటుందన్నారు.
అసలు 17 ఏళ్లుగా పనిచేస్తున్న దేవాదాయశాఖ ఉద్యోగులకు ప్రమోషన్లు లేకపోవడం ఏమిటని నిలదీశారు. కోర్టులో మీలో మీరు పిటిషన్లు వేసుకోవడం పక్కనపెట్టి ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలని.. అప్పుడు వారికి ప్రమోషన్లు ఇప్పించే బాధ్యతను ప్రభుత్వంతో మాట్లాడి తాను తీసుకుంటానని పిలుపునిచ్చారు. దేవాదాయ శాఖలో రెవెన్యూ అధికారుల పెత్తనాన్ని తాను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.