మేమెవ్వరికీ భయపడలేదు.. ప్లేటు ఫిరాయించిన స్వామీజీ
శ్రీశైల క్షేత్రంలో కుంభాభిషేకం చేయొద్దని చెబితే జగన్ వినలేదని, కోర్టులను మేనేజ్ చేసి, ఉత్తరాయనం వచ్చింది కదా అని కుంభాభిషేకం చేశారని, చివరకు ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు స్వామీజీ.
విశాఖ శారదా పీఠంకు వైసీపీ అధినేత జగన్ కు అవినాభావ సంబంధం ఉందనే విషయం అందరికీ తెలుసు. ఓ దశలో జగన్ మంత్రి మండలి విషయంలో కూడా శారదాపీఠం రికమండేషన్లు పనిచేశాయనే పుకార్లు వినిపించాయి. జగన్ ఆదరాభిమానాలు పొందాలనుకునే నాయకులంతా మందు విశాఖ శారదాపీఠాన్ని దర్శించుకునేవారు. అప్పట్లో ఆ హవా అలా ఉండేది. అసలు శారదాపీఠం అంతా జగన్ విజయం కోసమే పనిచేసిందని, పరితపించిందని.. అక్కడి చెట్టు, పుట్ట.. దేన్నిఅడిగినా అదే విషయం చెబుతాయని కూడా పరిపూర్ణానంద సెలవిచ్చారు. అలాంటి స్వామీజీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. చంద్రబాబుకి జై కొట్టారు.
ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ నాయకుల ప్రెస్ మీట్లు సహజం. అలాంటిది శారదాపీఠం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిందో ఎవరికీ అర్థం కావడంలేదు. తాము ఎవరికీ భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టలేదని ముందుగానే చెప్పిన పరిపూర్ణానంద, చంద్రబాబు అంటే తమకు చాలా గౌరవం అన్నారు. స్వామీజీలకు రాగద్వేషాలుండవని, వారికి అందరూ ఒకటేనన్నారు. చంద్రబాబు చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అని, మూడు సార్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఉందని, కేంద్రంతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నాయకుడని, ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి, ఆర్థికంగా బలోపేతం చేసేలా ఆయనకు శక్తిని ఇవ్వాలని భగవంతుడ్ని కోరుతున్నామన్నారు స్వామీజీ. అప్పట్లో జగన్ ని కూడా ఇలాగే పొగిడేసిన ఆయన.. ఇప్పుడు చంద్రబాబు అనుభవాన్ని ఆకాశానికెత్తేశారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆయన సెలవిచ్చారంటే, గత ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేసినట్టే లెక్క.
జగన్ అందుకే ఓడిపోయారు..
జగన్ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు పరిపూర్ణానంద. శ్రీశైల క్షేత్రంలో కుంభాభిషేకం చేయొద్దని చెబితే జగన్ వినలేదని, కోర్టులను మేనేజ్ చేసి, ఉత్తరాయనం వచ్చింది కదా అని కుంభాభిషేకం చేశారని, చివరకు ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారాయన. సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగిన ఘటనలపై అప్పుడే తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడానన్నారు. తిరుమల అన్నప్రసాదంలో తృణధాన్యాలు వాడతామన్నప్పుడు కూడా తాను విభేదించానన్నారు స్వామీజీ. ఇలా ఇప్పుడు జగన్ ప్రభుత్వ తప్పులన్నిటినీ ఆయన ఏకరువు పెట్టడం విశేషం.
మొత్తానికి ఏ ఎండకాగొడుగు పట్టడం రాజకీయ నాయకులకే కాదు, స్వామీజీలకు కూడా అవసరం అని గ్రహించారు పరిపూర్ణానంద. చంద్రబాబు గెలవగానే, ఆయన వీరుడు, శూరుడు, అనుభవజ్ఞుడు అంటూ ఆకాశానికెత్తేశారు. జగన్ హయాంలో విశాఖ శారదాపీఠంపై విమర్శలు చేసిన టీడీపీకి.. ఇప్పుడు ప్లేటు మార్చిన అదే పీఠం అద్భుతంగా కనిపిస్తుందేమో చూడాలి.