అక్కడ మోదీ, ఇక్కడ జగన్.. స్వామీజీ లాజిక్
మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రి అవుతారని చెప్పారు పరిపూర్ణానంద. ఏపీ వరకు ఆరా మస్తాన్ సర్వే ఫలిస్తుందని, వైసీపీ విజయం ఖాయమని అన్నారు.
మోదీపై అభిమానం ఉన్న వాళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతోపాటు ఏపీలో ఎన్డీఏ కూటమి గెలవాలని అనుకుంటారు. జగన్ పై అభిమానం ఉన్నవాళ్లు, ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని, కేంద్రంలో ఎవరికీ మంచి మెజార్టీ రాకూడదని కోరుకుంటారు. కానీ పరస్పరం విరుద్ధమైన ఆశక్తులను వ్యక్తపరిచారు స్వామి పరిపూర్ణానంద. హిందూపురం బీజేపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి విసిగి వేసారిన ఆయన.. చివరకు ఏపీలో జగన్ కి జై కొట్టారు. రేపు కౌంటింగ్ అనగా ఈరోజు ఆయనకు జగన్ పై అభిమానం పెరిగిపోవడం విశేషమే అయినా.. వైసీపీకి ఆయన ప్రియమైన వ్యక్తిగా మారారు.
కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ టీమ్ ఈసారి 123 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. స్వామీజీల మాటలు ఫలిస్తాయా, లేదా అనే విషయం పక్కనపెడితే.. ఆయన మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా 123 సీట్లు ఖాయం అని స్పష్టం చేశారు. ఏపీలో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో మాత్రం ఆయన మోదీకే మద్దతు తెలపడం విశేషం. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రి అవుతారని చెప్పారు పరిపూర్ణానంద. ఏపీ వరకు ఆరా మస్తాన్ సర్వే ఫలిస్తుందని, వైసీపీ విజయం ఖాయమని అన్నారు.
స్వామీజీ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వైరి వర్గం మాత్రం ఆయనకు అంత సీన్ ఉంటే.. బీజేపీ టికెట్ సాధించేవారు కదా అని ఎగతాళి చేస్తున్నారు. బీజేపీ టికెట్ దొరక్క నిరాశపడిన పరిపూర్ణానంద ఏపీలో ఎన్డీఏ కూటమి గెలవదని శాపనార్థాలు పెడుతున్నారని అంటున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఏపీ లో కూడా ఎన్డీఏ గెలిచేదని చెప్పి ఉండేవారు కదా అని లాజిక్ తీస్తున్నారు. ఎవరి లాజిక్ ఎంతవరకు ఫలిస్తుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.