సుప్రీంలో కూడా వైసీపీకి నిరాశ

పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. అయితే ఆశించిన ఫలితం దక్కలేదు.

Advertisement
Update:2024-06-03 13:31 IST

పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీంకోర్టులోనూ వైసీపీకి నిరాశ ఎదురైంది. పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఏపీ సీఈవో తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాబోతోంది. సీల్ లేకపోయినా ఏపీలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది. దీనిపై ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోడానికి మాత్రం వైసీపీకి మరో ఛాన్స్ మిగిలి ఉంది.

పోస్టల్ బ్యాలెట్ పై దాన్ని ధృవీకరించే అటెస్టేషన్ అధికారి సంతకంతోపాటు సీల్ కూడా ఉండాలనేది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన. అయితే ఏపీలో మాత్రం అధికారులు సీల్ లేకపోయినా ఓకే అంటూ వెసులుబాటు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ తప్పుబట్టింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టు తలుపుతట్టింది. ఈసీ నిర్ణయంలో తాను జోక్యం చేసుకోలేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. సీల్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటవుతుందన్న ఈసీ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ వైసీపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

న్యాయపోరాటం..

పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. అయితే ఈ విషయంలో వైసీపీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఎన్నికల పిటిషన్ వేయాలంటే ప్రతి నియోజకవర్గం ఫలితాన్ని విడివిడిగా సవాల్ చేయాల్సి ఉంటుంది. ఈ పిటిషన్లతో ఫలితం ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. వైసీపీ ముందు మిగిలి ఉంది అదొక్కటే ప్రత్యామ్నాయం. ఈ దశలో పార్టీ అధినాయకత్వం నిర్ణయం ఏంటో వేచి చూడాలి. రేపు వైసీపీ విజయం సునాయాసమైతే మాత్రం పోస్టల్ బ్యాలెట్ అంశానికి అంత ప్రాధాన్యత ఉండకపోవచ్చు. 

Tags:    
Advertisement

Similar News