సుజనా చౌదరి మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు..

అక్రమాల విషయంలో పలు హెచ్చరికలు చేసినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. నోటీసులకు కూడా సమాధానం లేదు. అందుకే గుర్తింపు రద్దు చేస్తూ ఈరోజు నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వులిచ్చింది.

Advertisement
Update:2023-05-30 17:28 IST

రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు చేసింది. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎంపీ, అందులోనూ ప్రస్తుతం బీజేపీలోనే ఉన్న నాయకుడికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడమేంటనే ప్రశ్నలు వినపడుతున్నాయి. వ్యవస్థలన్నిటినీ బీజేపీ మేనేజ్ చేస్తుంది కానీ.. సుజనా విషయంలో ఏదో తేడా కొట్టిందనే వార్తలు బయటకొచ్చాయి.

హైదరాబాద్‌ శివార్లలోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘన్‌ పూర్‌ లో సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఉంది. 2002లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీలో 100 సీట్లు యూనివర్శిటీ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ అవుతాయి. 2017 ఫిబ్రవరిలో సీట్ల సంఖ్య 150కి పెరిగింది. అయితే సీట్లు పెంచుకునే విషయంలో.. మౌలిక సదుపాయాలు లేనివి ఉన్నట్టుగా చూపించారనే ఆరోపణలున్నాయి. పలు అక్రమాలకు పాల్పడినట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గుర్తించింది. ఇప్పటికే ఈ అక్రమాల విషయంలో పలు హెచ్చరికలు చేసినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. నోటీసులకు కూడా సమాధానం లేదు. అందుకే గుర్తింపు రద్దు చేస్తూ ఈరోజు ఉత్తర్వులిచ్చింది NMC.

2012-13 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం 750 మంది MBBS విద్యార్థులు, 150 మంది PG విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆస్పత్రికి ప్రతిరోజూ ఔట్ పేషెంట్లు వస్తుంటారు. ఆస్పత్రిలో 13 డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఈ ఆస్పత్రి నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు NMC ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News