పిచ్చి పనులు మానుకో జగన్‌- చంద్రబాబు వరుస ట్వీట్లు

కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేయలేని జగన్‌ ఉన్న వాటికి పేర్లు మార్చుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం..ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుందని ప్రశ్నించారు.

Advertisement
Update:2022-09-21 10:57 IST

ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్పు ప్రతిపాదనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. వరుసగా ఆయన ట్వీట్లు చేశారు. అసలు హెల్త్ యూనివర్శిటీకి వైఎస్‌ఆర్‌కు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తమ ప్రభుత్వం ఉండగా 1998లో పెట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్ఆర్‌తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆలోచన చెయ్యలేదన్నారు. ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన విశ్వవిద్యాలయానికి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్థరహితమని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేయలేని జగన్‌ ఉన్న వాటికి పేర్లు మార్చుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం..ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుందని ప్రశ్నించారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వ్యక్తి జగన్‌ అని చంద్రబాబు మండిపడ్డారు.

చేతనైతే కొత్తవి నిర్మించాలి గానీ.. దశాబ్దాల నాటి సంస్థలకు పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇదో తుగ్లక్ చర్య- లోకేష్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని నారా లోకేష్ ట్విట్టర్లో డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య అని విమర్శించారు. అసలు వైఎస్‌కి, హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఏంటి? హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృద్ధి చేసింది ఎన్టీఆర్ అని లోకేష్ చెప్పుకొచ్చారు. పేరు మారిస్తే జగన్ శాశ్వతంగా చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని లోకేష్ శపించారు.

Tags:    
Advertisement

Similar News