జగన్ పై దాడి కేసు.. ఈరోజు కోర్టు ముందుకు A2
జగన్ పైకి రాయి విసిరింది సతీష్, కానీ రాయి వేయాలని ప్రేరేపించింది, డబ్బులు ఎర చూపించింది మరో వ్యక్తి. అతడిని ఈరోజు కోర్టు ముందుకు తెస్తారు.
సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో నిన్న(గురువారం) ప్రధాన నిందితుడు వేముల సతీష్ కుమార్ అలియాస్ సత్తి ని కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. కోర్టు అతడికి 2 వారాల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సతీష్ A1 కాగా, ఈరోజు A2 ని కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశముంది. జగన్ పైకి రాయి విసిరింది సతీష్, కానీ రాయి వేయాలని ప్రేరేపించింది, డబ్బులు ఎర చూపించింది A2 అని అంటున్నారు. దుర్గారావు అనే వ్యక్తి ఈ పనిచేశారని, అతడిని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది.
కాంక్రీట్ రాయి..
సీఎం జగన్ పై దాడి జరిగిన తర్వాత గాయం చేసిన వస్తువుపై రకరకాల కథనాలు వినిపించాయి. అది రాయి అని ఒకరు, కాదు ఎయిర్ బుల్లెట్ అని మరొకరు, పదునైన వస్తువు అని ఇంకొకరు అన్నారు. చివరకు పోలీసులు అది రాయి అని తేల్చారు. కాంక్రీట్ రాయితో సీఎం జగన్ పై దాడి చేశారని అధికారికంగా ప్రకటించారు.
100మంది అనుమానితులతోపాటు, మరికొందరిని విచారించి, సమగ్ర సమాచారం సేకరించిన తర్వాత వేముల సతీష్ కుమార్ ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు పోలీసులు. ఈ క్రమంలో సీసీ టీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డింగ్ అనాలసిస్, టవర్ డంప్, ప్రత్యక్ష సాక్షుల స్టేట్ మెంట్స్ తమకు ఉపయోగపడ్డాయని చెప్పారు. అయితే అధికారిక ప్రకటనలో పోలీసులు అంతవరకే వివరాలు చెప్పారు. రాయి వేయాలని చెప్పింది ఎవరు..? అతడికి సుపారీ ఇచ్చారా..? డీల్ ఎలా జరిగింది..? దీని వెనక ఎవరెవరు ఉన్నారనే విషయాలను మాత్రం చెప్పలేదు. ఈరోజు ఈ కేసుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది. దుర్గారావు అనే పేరు బలంగా వినపడుతోంది, ఆయన టీడీపీకి చెందిన నాయకుడని కూడా అంటున్నారు. మరి పోలీస్ విచారణలో తేలిందేంటి..? దుర్గారావు కాకుండా ఇంకా ఎవరికైనా ఈ కేసులో ప్రమేయం ఉందా...? అనేది తేలాల్సి ఉంది.