ఆయనలో శివుడిని చూశా.. అందుకే కాళ్లకు దండం పెట్టా..

శివరాత్రి సందర్భంగా కొంతమంది ఉచిత దర్శనాలంటూ తన రికమండేషన్ కోసం వచ్చారని, వారికి దర్శనాలు ఫ్రీగా దొరకలేదనే కోపంతో తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు ఈవో లవన్న.

Advertisement
Update:2023-02-21 08:13 IST

మంత్రి పెద్దిరెడ్డి కాళ్లకు మొక్కారు ఓ అధికారి. పైగా ఆయన శివ మాలధారణలో ఉన్నారు. శివ మాల ధరించి, ఓ మామూలు మనిషి కాళ్లకు మొక్కడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే వివరణలు మొదలయ్యాయి. మంత్రి పెద్దిరెడ్డిలో తాను శివుడిని చూశానని, అందుకే కాళ్లకు మొక్కానని చెప్పుకొచ్చారు సదరు అధికారి. మనుషుల్లో దేవుడ్ని చూడలేనివారే ఇలా అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తారంటూ మండిపడ్డారు.

ఏపీ అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరకున్న మంత్రి పెద్దిరెడ్డికి పూలమాలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో లవన్న, తర్వాత పాదాభివందనం చేశారు. శివమాలాధరణలో ఉన్న లవన్న, మంత్రి పెద్దిరెడ్డికి పాదాభివందనం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి వద్దని వారిస్తున్నా దండ వేసి దండం పెట్టేవరకు వదిలిపెట్టలేదు లవన్న. స్వామిభక్తిని ఆయన అలా చాటుకున్నారని, శివమాల ధరించిన ఈవో శివభక్తుల మనోభావాలను దెబ్బతీసారని, వెంటనే ఆయనను సస్పెండ్‌ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి.

ఇదీ వివరణ..

మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన ఘటనపై ఈవో లవన్న వివరణ ఇచ్చారు. పెద్దిరెడ్డి తన గురువు అని, 76 సార్లు అయ్యప్పమాల ధరించి, శబరిమలకు వెళ్లివచ్చిన గురుస్వామి ఆయన అని చెప్పారు. ఆయన కాళ్లు మొక్కడం తప్పా అని ప్రశ్నించారు. ఎదుటి వ్యక్తిలో శివుడిని చూడటం తప్పు అంటే, గురువుని మొక్కడం కూడా తప్పే అవుతుంది కదా అన్నారు.

దర్శనాలపై కోపం..

శివరాత్రి సందర్భంగా కొంతమంది ఉచిత దర్శనాలంటూ తన రికమండేషన్ కోసం వచ్చారని, వారికి దర్శనాలు ఫ్రీగా దొరకలేదనే కోపంతో తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు ఈవో లవన్న. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అనవసరంగా శ్రీశైల క్షేత్రానికి మచ్చ తెచ్చే పనులు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News