శ్రీసిటీలో ప్రారంభోత్సవాలపై ట్వీట్ ఫైట్
శ్రీసిటీ వ్యవహారంపై సిగ్గు సిగ్గు అంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష వైసీపీ విమర్శించింది. ఇలా చేయడానికి కొంచెమైనా సీఎం చంద్రబాబుకి సిగ్గుండాలని వైసీపీ అధికారికంగా ట్వీట్ వేసింది.
తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించిన సీఎం చంద్రబాబు 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించారు. మరో 7 నూతన సంస్థలకు శంకుస్థాపన చేశారు. శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సీఎం వారికి వివరించారు. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేది తన ఆలోచన అని అని చెప్పారు చంద్రబాబు. శ్రీసిటీకి ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయని, పారిశ్రామిక ప్రాంతంగానే కాకుండా, అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా కూడా దీన్ని మారుస్తామన్నారు సీఎం చంద్రబాబు.
అంతా బాగానే ఉంది కానీ.. శ్రీసిటీ వ్యవహారంపై సిగ్గు సిగ్గు అంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష వైసీపీ విమర్శించింది. ఇలా చేయడానికి కొంచెమైనా సీఎం చంద్రబాబుకి సిగ్గుండాలని వైసీపీ అధికారికంగా ట్వీట్ వేసింది. శ్రీసిటీలో చంద్రబాబు ప్రారంభించిన ఏ కంపెనీ కూడా ఆయన్ను చూసి రాలేదని, అవన్నీ జగన్ హయాంలో వచ్చినవేనని గుర్తు చేసింది వైసీపీ. కష్టం ఎవరిదైనా దొడ్డిదారిలో ఆ క్రెడిట్‌ను కొట్టేయడం చంద్రబాబుకి అలవాటని కూడా కౌంటర్ ఇచ్చింది. నిజాలు దాచినా, టీడీపీ ఫేక్ బతుకుల గురించి జనాలకి తెలుసని వైసీపీ నుంచి ఘాటు ట్వీట్ పడింది.
సిగ్గు సిగ్గు..
వైసీపీ ట్వీట్ కి వెంటనే టీడీపీ కౌంటర్ ఇచ్చింది. సిగ్గిలేనిది ఎవరికని టీడీపీ ప్రశ్నించింది. శ్రీసిటీలో ఉన్న ప్రతి కంపెనీని తెచ్చింది చంద్రబాబేనని టీడీపీ బదులిచ్చింది. ఆయన తెచ్చిన కంపెనీలను కూడా జగన్ హయాంలో ప్రారంభించలేకపోయారని, తిరిగి చంద్రబాబే వాటిని ప్రారంభించాల్సి వచ్చిందని తన ట్వీట్ లో పేర్కొంది. జగన్ ని చూస్తే గంజాయి బ్యాచ్, ఎర్రచందనం బ్యాచ్, గొడ్డలి బ్యాచ్ , ఫ్యాక్షన్ బ్యాచ్ వస్తాయి కానీ.. కంపెనీలు వస్తాయా ? అని టీడీపీ వెటకారంగా ప్రశ్నించింది.