పవన్ మూడు పెళ్లిళ్లపై బీజేపీ నో కామెంట్..
పవన్ కల్యాణ్ వివాహాల విషయంపై నో కామెంట్ అంటూ తప్పుకున్నారు సోము వీర్రాజు. పవన్ వివాహాలపై తమ పార్టీ స్పందించబోదని చెప్పారు. పొత్తు విషయాలు మాత్రం పవన్ కల్యాణ్‌తో కూర్చుని మాట్లాడతామంటున్నారు వీర్రాజు.
ఏపీలో ఇటీవల పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం పొలిటికల్ హాట్ టాపిక్‌గా ఉంది. మూడు రాజధానులకు బదులుగా వైసీపీ నేతలు పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు. దీనికి ఘాటుగా రియాక్ట్ అయిన పవన్ చెప్పు చూపించి తోలు తీస్తానంటూ హెచ్చరించారు. ఆ తర్వాత సీఎం జగన్ కూడా తన ప్రసంగంలో మూడు పెళ్లిళ్లతో దత్త పుత్రుడు సభ్యసమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ నిలదీశారు, దానికి కొనసాగింపుగా మహిళా కమిషన్ నోటీసులు, ట్విట్టర్లో జనసేన సెటైర్లు.. ఇలా జరుగుతోంది ఈ వ్యవహారం. అయితే జనసేన మిత్రపక్షమైన బీజేపీకి ఈ మూడు పెళ్లిళ్ల వ్యవహారం తలనొప్పిగా మారింది.
వైసీపీ పదే పదే హిందూ సంప్రదాయం అంటూ పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో రియాక్ట్ అయింది. దీంతో బీజేపీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మూడు పెళ్లిళ్లను సమర్థించలేరు, అలాగని విమర్శించనూ లేరు. అందుకే నో కామెంట్ అంటూ తప్పుకున్నారు. అనంతపురం పర్యటనలో ఉన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుని పవన్ కల్యాణ్ వివాహాల విషయంపై ప్రశ్నిస్తే, సింపుల్‌గా నో కామెంట్ అంటూ తప్పుకున్నారు. పవన్ వివాహాల వ్యవహారంపై తమ పార్టీ స్పందించబోదని చెప్పారు. పొత్తు విషయాలు మాత్రం పవన్ కల్యాణ్‌తో కూర్చుని మాట్లాడతామంటున్నారు వీర్రాజు.
కన్నాపై కూడా అదే స్పందన..
ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా సోము స్పందించను అని చెప్పడం విశేషం. పార్టీ అధ్యక్షుడిగా తాను ఆ విషయంపై మాట్లాడను అని గతంలోనే క్లారిటీ ఇచ్చిన వీర్రాజు, ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడే అధికారం సీఎం వైఎస్ జగన్‌కు లేదని మండిపడ్డారు. విశాఖను స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం అభివృద్ధి చేసిందని చెప్పుకొచ్చారు వీర్రాజు.