సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం
చీకటి రాతలు రాసేందుకు మనకు ఈనాడు, ఏబీఎన్, టీవీ–5.. లాంటి వారు తోడు లేరని.. ఎల్లో ఛానెల్స్, పత్రికలను బాబులాగా తాను పోషించలేదని చెప్పారు. తాను ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నానని మరోసారి స్పష్టం చేశారు జగన్.
వైసీపీ పోటీ కేవలం కూటమిలోని రాజకీయ పార్టీలతోనే కాదు, కూటమితో అంటకాగుతున్న ఎల్లోమీడియాతో కూడా. సిద్ధం సభలకు జనం రాలేదని, బస్సు యాత్రలో కూడా జనం లేరని, జగన్ పని అయిపోయిందని, జనం వైసీపీకి ఓట్లు వేయరని.. ఇలా రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తోంది ఎల్లో మీడియా. దాన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ మీడియా ఒక్కటే సరిపోదని జగన్ కి కూడా తెలుసు. అందుకే సోషల్ మీడియాని ఆయన బలంగా నమ్ముకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాని ఎదుర్కొందామని నంద్యాల సభలో జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
తన ద్వారా మేలుపొందిన ప్రతి పేదవాడు తనకు స్టార్ క్యాంపెయినర్ అని ఇదివరకే సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలన్నారు. ఎల్లో మీడియాకు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక ఎడిటర్ అని, ఒక ఛానల్ ఓనర్ అని చెప్పారు జగన్. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకిపారేద్దామన్నారు. మనందరి ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రతి ఇంటా వివరించాలని కోరారు. పేదవాడి భవిష్యత్‌కు అండగా నిలబడేందుకు, మంచి చేసిన మన ప్రభుత్వానికి తోడుగా ఉండేందుకు, వైసీపీకి 175 మంది ఎమ్మెల్యేలను, 25 మంది ఎంపీలను గెలిపించేందుకు మనమంతా సిద్ధమై చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు జగన్.
మేనిఫెస్టోలోని అంశాల్లో 99 శాతం హామీలు అమలు చేసి చూపించామన్నారు జగన్. ఈ మార్పుల్లో కనీసం 5 శాతం అయినా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. "నిజంగానే చంద్రబాబు 5 శాతం మార్పు తెచ్చి ఉంటే.. ఎల్లో మీడియా ఊరికే ఉండేది కాదు. చంద్రబాబుకి 10రంగాల్లో నెబెల్ ప్రైజులు రావాలని ప్రచారం చేసేది. 4 ఆస్కార్‌లు, మెగసెసే అవార్డులు ఇవ్వాలనేది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు.. ఇద్దరూ కలిసి వచ్చి చంద్రబాబుకు శాలువా కప్పాలని ప్రచారం చేసేది.." అంటూ చెణుకులు విసిరారు జగన్.
తమ ప్రభుత్వం వల్ల లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ తాజా ఎన్నికల యుద్ధంలో సైనికులేనని అన్నారు జగన్. చీకటి రాతలు రాసేందుకు మనకు ఈనాడు, ఏబీఎన్, టీవీ–5.. లాంటి వారు తోడు లేరని.. ఎల్లో ఛానెల్స్, పత్రికలను బాబులాగా తాను పోషించలేదని చెప్పారు. తాను ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నానని మరోసారి స్పష్టం చేశారు జగన్.