ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్ రిపోర్టు.. కీలక అంశాలు ఇవే!
మీడియాతో మాట్లాడిన సిట్ చీఫ్ వినీత్ బిజ్రాల్.. అన్ని జిల్లాల్లో సమగ్ర పరిశీలన జరిపామన్నారు. అన్ని ఘటనలపై కేసులు నమోదు చేయడంపై ఆరా తీశామని.. దర్యాప్తులో చాలా లోపాలు గుర్తించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత చెలరేగిన హింసపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ - SIT విచారణ పూర్తయింది. మొత్తం 150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించారు సిట్ చీఫ్ వినీత్ బిజ్రాల్. మొత్తం 3 జిల్లాల పరిధిలో ఆరు చోట్ల అల్లర్లు జరిగినట్లు ధృవీకరించింది సిట్. పల్నాడు జిల్లా నరసరావుపేట, మాచర్ల, గురజాలతో పాటు తిరుపతి, చంద్రగిరిలో అల్లర్లు జరిగాయని తెలిపింది. వీటితో పాటు అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో అల్లర్లు జరిగాయని సిట్ స్పష్టం చేసింది.
ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 1370 మందిపై FIR నమోదు చేసినట్లు తెలిపిన సిట్.. ఇప్పటివరకూ 124 మందిని అరెస్టు చేసినట్లు నివేదికలో స్పష్టం చేసింది. 94 మందికి 41A నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది సిట్. పల్నాడు జిల్లా పరిధిలో 22 కేసులు, అనంతపురం జిల్లా పరిధిలో 7, తిరుపతి జిల్లా పరిధిలో 4 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొంది.
అనంతరం మీడియాతో మాట్లాడిన సిట్ చీఫ్ వినీత్ బిజ్రాల్.. అన్ని జిల్లాల్లో సమగ్ర పరిశీలన జరిపామన్నారు. అన్ని ఘటనలపై కేసులు నమోదు చేయడంపై ఆరా తీశామని.. దర్యాప్తులో చాలా లోపాలు గుర్తించినట్లు తెలిపారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు నమోదు చేయడానికి కోర్టుల్లో మెమో దాఖలు చేయాలని, అరెస్టు చేయడంతో పాటు ఛార్జిషీట్‌లు దాఖలు చేయాలని విచారణ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.