ఆఖరి సిద్ధం మరింత ఘాటుగా.. విపక్షాలపై జగన్ పంచ్ లు

చంద్రబాబు టీమ్ లో ఉన్న పార్టీల్లో సైన్యాధిపతులు ఉన్నారే కానీ వారికి సైన్యం లేదని ఎద్దేవా చేశారు సీఎం జగన్. చంద్రబాబు వైపు ఉన్న పార్టీలు నోటాతో పోటీపడే పార్టీలని అన్నారు.

Advertisement
Update:2024-03-10 18:29 IST

బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ఆఖరి సిద్ధం సభ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. విపక్షాలపై జగన్ పంచ్ ల వర్షం కురిపించారు. చంద్రబాబుని, పవన్ కల్యాణ్ ని, ఆ కూటమితో నిన్న కలిసిన ప్రధాని మోదీని.. అందరినీ ఒకే గాటన కట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శకుని చేతిలో పాచికలు, చంద్రబాబు ఇచ్చే వాగ్దానాలంటూ సెటైర్లు పేల్చారు. చంద్రబాబు తాజా మేనిఫెస్టో మొత్తం కిచిడీయేనన్నారు జగన్. వేరే రాష్ట్రాల నుంచి కొన్ని హామీలను తీసుకొచ్చి మేనిఫెస్టోలో కలిపారని, దానికి మళ్ళీ భారీ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నరకలోకానికి, నారా లోకానికి రమ్మంటే ఎవరూ రారు కాబట్టి, ఎంట్రన్స్ లో సర్వర్గం చూపించి, లోపలికి వెళ్లాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబుది అంటూ కౌంటర్ ఇచ్చారు జగన్.


Full View


సైన్యం లేని సైన్యాధిపతులు..

చంద్రబాబు టీమ్ లో ఉన్న పార్టీల్లో సైన్యాధిపతులు ఉన్నారే కానీ వారికి సైన్యం లేదని ఎద్దేవా చేశారు సీఎం జగన్. చంద్రబాబు వైపు ఉన్న పార్టీలు నోటాతో పోటీపడే పార్టీలని అన్నారు. చిత్తుగా ఓడిపోయిన పార్టీలన్నీ ఓ చోట చేరాయని అన్నారు. జగన్‌ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలని మనం యుద్ధానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీకి తానొక్కటే సూటి ప్రశ్న అడుగుతున్నానని, ఏపీకి హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా ఏమైందని నిలదీశారు జగన్. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న తనకు ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారని చెప్పారు జగన్.

ప్రజా సముద్రం..

మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవాడానికి మీరంతా సిద్ధమా...? అంటూ ప్రశ్నించి ప్రజల్ని ఉత్సాహపరిచారు సీఎం జగన్. సిద్ధమంటే ప్రజలు చేసే యుద్ధం అని, సిద్ధమంటే ప్రజాసముద్రం అని అన్నారు. నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్‌లు లేవని, టైర్లు కూడా లేవని, ఆ సైకిల్ తుప్పుపట్టిందని, తుప్పు పట్టిన సైకిల్ ని తోయడానికి వేరే పార్టీలను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. సైకిల్‌ చక్రం తిరగక.. ఢిల్లీ చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నారని అన్నారు. విరగగాసిన మామిడి చెట్టులా మనం ఉంటే.. తెగులుపట్టిన చెట్టులా చంద్రబాబు పరిస్థితి ఉందన్నారు జగన్.

సెల్ ఫోన్లు బయటకు తీయండి..

మీరంతా నాతోపాటు ఎన్నికలకు సిద్ధమైతే.. జేబుల్లోనుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి లైట్ ఆన్ చేసి సంఘీభావం తెలపాలన్నారు సీఎం జగన్. సెల్ ఫోన్లో టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి వెలుగుల పాలనలో ప్రయాణానికి మరోసారి సిద్ధం అని చెప్పాలని పిలుపునిచ్చారు. జగన్ అనే నేను మీ సేవకుడిగా మరో ఐదేళ్లు మంచి పాలన అందించేందుకు సిద్ధం అంటూ తన ప్రసంగం ముగించారు.

Tags:    
Advertisement

Similar News