ఆమె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు నోటీసులు

ఎమ్మెల్యే భార్యకు అధికారిక హోదా లేకపోయినా.. ఆమె బర్త్ డే వేడుకలకు ఎందుకు హాజరయ్యారంటూ పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

Advertisement
Update:2024-08-29 18:39 IST

టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి పుట్టినరోజు వేడుకలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకల్లో ఆమె కేక్ కట్ చేస్తుండగా వెనక పోలీసులు కూడా నిలబడి ఉన్న వీడియోలు బయటకొచ్చాయి. ఎమ్మెల్యే భార్య బర్త్ డే పార్టీకి పోలీసులు హాజరవడమేంటని ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసింది. దీంతో వెంటనే ప్రభుత్వం నష్టనివారణ చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యే సతీమణి బర్త్ డే వేడుకలకు హాజరైన పోలీసులకు జిల్లా ఎస్పీ షోకాజ్ నోటీసులిచ్చారు.

ఎమ్మెల్యే భార్యకు అధికారిక హోదా లేకపోయినా.. ఆమె బర్త్ డే వేడుకలకు ఎందుకు హాజరయ్యారంటూ పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. చిలకలూరిపేట టౌన్‌ సీఐ, రూరల్ సీఐ, నలుగురు ఎస్సైలకు జిల్లా ఎస్పీ మెమోలు ఇచ్చారు. చిలకలూరిపేట ట్రాఫిక్‌ ఏఎస్సై, మరో హోంగార్డ్ కి కూడా నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా ఎస్పీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అందులో కోరారు.

పోలీసులతో టీడీపీ నేతల వ్యవహార శైలిపై ఇటీవల వరుస విమర్శలు వినిపించాయి. ఆమధ్య మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, తనను వెయిట్ చేయించారంటూ ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. అప్పట్లోనే మంత్రికి సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఇటీవల తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి, సీఐ సారీ చెప్పడం కూడా పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటు ఎమ్మెల్యే సతీమణి బర్త్ డే వేడుకల్లో పోలీసులు పాల్గొనడం, దగ్గరుండి కేక్ కట్ చేయించడం మరింత వివాదాస్పదమైంది. దీంతో పోలీస్ అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. 

Tags:    
Advertisement

Similar News