మళ్లీ జగనే టార్గెట్.. షర్మిల లేటెస్ట్ ట్వీట్
విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతిచ్చిన జగన్, కాంగ్రెస్ తనతో కలసి రాలేదని అనడం సరికాదన్నారు షర్మిల.
తమతో కలసి వచ్చే పార్టీలతోనే తాము కలసి పనిచేస్తామని జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో తాము ధర్నా చేపట్టినప్పుడు ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు కలసి వచ్చాయి కానీ, కాంగ్రెస్ రాలేదని గుర్తు చేశారు. అంటే తాము కూడా కాంగ్రెస్ కి దూరంగానే ఉంటామని చెప్పకనే చెప్పారు జగన్. అయితే మీకు కాంగ్రెస్ అక్కర్లేనప్పుడు కాంగ్రెస్ కి కూడా మీరు అక్కర్లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్ కి బదులిచ్చారు. జగన్ ని ఉద్దేశిస్తూ తాజాగా ఓ ఘాటు ట్వీట్ వేశారు షర్మిల.
అసలు ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలని ప్రశ్నించారు షర్మిల. పార్టీ ఉనికికోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా, లేక వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా అని.. అడిగారు. ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని, విభజన హక్కుల్ని కాలరాసి, ప్రత్యేక హోదాని బీజేపీకి తాకట్టు పెట్టారని వైసీపీపై మండిపడ్డారు షర్మిల. మణిపూర్ ఘటనపై కూడా జగన్ నోరెత్తలేదని గుర్తు చేశారు.
విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతిచ్చిన జగన్, కాంగ్రెస్ తనతో కలసి రాలేదని అనడం సరికాదన్నారు షర్మిల. వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకి జై కొట్టిన ఆయనకు కాంగ్రెస్ ని విమర్శించే హక్కు లేదన్నారు. వైసీపీ ఢిల్లీలో చేపట్టిన నిరసనలో నిజం లేదని అన్నారు. స్వలాభం తప్ప అందులో రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని, అందుకే కాంగ్రెస్ పార్టీ వారి ధర్నాకు దూరంగా ఉందని వివరించారు. సిద్ధం అని ఎన్నికల సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన వారికి 11మంది బలం సరిపోలేదా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు షర్మిల.