తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం..
ప్రమాదం జరిగిన సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఈ కారులోని సుభాష్ అనే వ్యక్తి తల్లి, భార్య, కుమార్తె ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.
రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక కారు టైరు పేలడంతో అదుపుతప్పి.. డివైడర్‌ను దాటుకొని మరీ.. ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నందిగామ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ కారు దేవరపల్లి మండలం జాతీయ రహదారి బంధపురం వద్దకు రాగానే టైరు పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుంటూ రోడ్డు అవతలి వైపునకు వెళ్లి.. ఎదురుగా వస్తున్న మరో కారును శరవేగంగా ఢీకొట్టింది. ఆ కారు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఈ కారులోని సుభాష్ అనే వ్యక్తి తల్లి, భార్య, కుమార్తె ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. రెండు కార్లలోనూ కలిపి 11 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 8 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆస్పత్రులకు తరలించారు.