కాపు వర్గంలో కాక రేపుతున్న లేఖలు..

లేఖలపై లేఖలు రాసుకుంటున్న వీరిద్దరూ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. అయితే వైసీపీలో మిగతా కాపునేతలెవరూ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం విశేషం.

Advertisement
Update:2023-02-08 09:17 IST

ఏపీలో కాపుల ఓట్లు ఎటువైపు..? ఎప్పుడూ వన్ సైడ్ అని చెప్పలేం. ఆయా పార్టీలకు అనుకూలంగా అప్పుడప్పుడూ మారుతుంటాయి. ఒంటరి, బలిజ, తెలగ, కాపు.. ఇలా అందరి ఓట్లు గుంప గుత్తగా తమకే పడితే తమదే రాజ్యాధికారం అంటున్నారు కాపులు. కానీ వారికంటూ ఓ పార్టీ లేదు. జనసేన ఉన్నా కాపులందరూ పవన్ ని నమ్మడం లేదు. కాంగ్రెస్ లో కాపులకు అవకాశం కూడా రాలేదు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లో ఆ ఆశ అస్సలు లేదు. టీడీపీ గెలిచినా సీఎం పోస్ట్ నారా కుటుంబానికి వెళ్తుంది కానీ పొత్తులో ఉన్నా కూడా పవన్ కల్యాణ్ కి ఇవ్వరు. ఈ విషయం తెలిసి కూడా పవన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే, తనని పూర్తిగా తీసిపారేసిన జగన్ కి గుణపాఠం చెప్పాలనే కసి ఆయనలో ఉంది. ఆయనకు మద్దతుగా ఉన్న హరిరామజోగయ్య సహా మిగతా సీనియర్ నేతల అభిప్రాయం కూడా అదే. పవన్ కల్యాణ్ టీడీపీతో కలసి వెళ్లినా, వెళ్లకపోయినా వారంతా ఆయనకే మద్దతివ్వాలనుకుంటున్నారు, అదే సమయంలో వైసీపీని వ్యతిరేకిస్తున్నారు.

వైసీపీలో కాపుల సంగతేంటి..?

వైసీపీలో కాపులకు జగన్ తగిన ప్రాధాన్యతే ఇచ్చారు. మంత్రి పదవులిచ్చారు, రెండో దఫా కమ్మ సామాజిక వర్గానికి ఒక్క పదవి కూడా ఇవ్వకుండా కాపులకు కంటిన్యూ చేశారు. దీంతో వైసీపీతోనే కాపులకు రాజ్యాధికారం అంటూ ఆ పార్టీలోని ఆ సామాజిక నేతలు జగన్ ని నెత్తిన పెట్టుకున్నారు. సహజంగానే పవన్ ని సపోర్ట్ చేస్తున్న నేతలకు ఇది మింగుడుపడటంలేదు. పవన్ ని విమర్శించినా వారు సహించలేకపోతున్నారు. ఈ క్రమంలో పవన్ పై విమర్శలు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కి చేగొండి హరిరామ జోగయ్య రాసిన లేఖ సంచలనంగా మారింది. వాటికి కౌంటర్ గా అమర్నాథ్ మూడు లెటర్ల సిరీస్ విడుదల చేశారు. లెటర్-1, లెటర్-2, లెటర్-3 అంటూ వరుసగా మూడు రోజులు మూడు బహిరంగ లేఖలు రాశారు, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్నిటి సారాంశం ఒక్కటే. కాపులకు అన్యాయం చేసిన చంద్రబాబుతో కలసి వెళ్తున్న పవన్ కల్యాణ్ ని ఆ సామాజిక వర్గం ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలి... అని. వంగవీటి రంగాను అంతం చేయడంలో చంద్రబాబు పాత్ర ఉందని చెప్పిన హరిరామ జోగయ్య, ఇప్పుడు అదే చంద్రబాబుకి లాభం చేకూరే పని ఎందుకు చేస్తున్నారు.. అని.

అమర్నాథ్ మూడు లేఖలు రాసిన తర్వాత హరిరామ జోగయ్య కూడా మరో లేఖాస్త్రం సంధించారు. కాపు సంక్షేమం కోరి కాపుసంక్షేమ సేన స్థాపించానని, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనేది తన మొదటి లక్ష్యమని చెప్పారాయన. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం మరో లక్ష్యం అని అన్నారు. అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో రెండు కులాలు మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయని విమర్శించారు. ఒకరిని మించిన సంక్షేమం మరొకరు చేయడం కష్టమేమీ కాదన్న ఆయన, తనను నన్నురెచ్చగొట్టి లాభపడే ప్రయత్నం చేయొద్దంటూ మంత్రి అమర్నాథ్‌ కు చురకలంటించారు.

ఇలా లేఖలపై లేఖలు రాసుకుంటున్న వీరిద్దరూ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. అయితే వైసీపీలో మిగతా కాపునేతలెవరూ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం విశేషం. ప్రస్తుతానికి వీరిద్దరూ లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎక్కడా ఎవరూ తగ్గేలా కనిపించడంలేదు. ఈ లేఖలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News