పార్టీలకు సెప`రేటు` మీడియా
పార్టీల బలం మీడియా సంస్థలే అని ఇరుపార్టీలు గుర్తించాక ఇటు, అటు మాటలతో దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. టిడిపికి మద్దతుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి తోడు టీవీ5 కూడా వచ్చి చేరింది. అధికారం కోల్పోయిన తరువాత టిడిపి కూడా మీడియా వార్‌కి సై అంటూ సవాల్ విసిరింది.
ఒక్కో రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. జాతీయ పార్టీలైనా, ప్రాంతీయ పార్టీలైనా ఈ లైన్ నుంచి దూరం జరిగినా అదే తమ సిద్ధాంతమంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. కాలం మారింది. ఆధునిక కాలంలో రాజకీయ పార్టీలు నయా కార్పొరేట్ కంపెనీల్లా రూపాంతరం సంతరించుకున్నాయి. కార్పొరేట్ ఆఫీసుల్ని తలదన్నే కార్యాలయాలు, వ్యవస్థలని ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతీ రాజకీయ పార్టీకి మద్దతుగా మీడియా సంస్థలు గతంలో పనిచేసేవి. ఈ ముసుగులు ఇప్పుడు తీసేసి రాజకీయ పార్టీలే పత్రికలు, మీడియా సంస్థలు నడుపుకుంటున్నాయి. ఇది అందరికీ తెలిసిందే.
అయితే పార్టీ అధినేతలు తమ శత్రు మీడియా, మిత్ర మీడియా అని విడదీసి ప్రకటిస్తుండటంతో ఎవరి మీడియా ఏదో సామాన్యులకి కూడా అర్థమైపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆ రెండు పత్రికలంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేశారు. ఆ మీడియా సంస్థలు టిడిపివి అని, వాటి రాతలు పట్టించుకోవద్దని, పార్టీ నేతలు ఆ మీడియా ఉచ్చులో పడొద్దని అన్యాపదేశంగా హెచ్చరించేవారు. ఆ తరువాతి కాలంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సొంతంగా సాక్షి మీడియా సంస్థల్ని ఆరంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆరంభించాక టిడిపి మద్దతుగా ఉండే మీడియాని ఎల్లోమీడియా అంటూ ప్రచారం ప్రారంభించారు.
పార్టీల బలం మీడియా సంస్థలే అని ఇరుపార్టీలు గుర్తించాక ఇటు, అటు మాటలతో దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. టిడిపికి మద్దతుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి తోడు టీవీ5 కూడా వచ్చి చేరింది. అధికారం కోల్పోయిన తరువాత టిడిపి కూడా మీడియా వార్‌కి సై అంటూ సవాల్ విసిరింది. సాక్షి, సాక్షి2 అంటూ టీవీ9, ఎన్టీవీపై ఆరోపణలు గుప్పించింది. వీటితోపాటు 10టీవీ, సుమన్ టీవీ కూడా వైసీపీకి వత్తాసుపలికే బులుగు మీడియా అని, వాటిని టిడిపి నిషేధించిందని ప్రకటించింది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5లను జగన్ మోహన్‌రెడ్డి అధికారికంగానే అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయగలిగారు. అవకాశం దొరికినప్పుడల్లా ఎల్లోమీడియా అంటూ దుమ్మెత్తిపోయడం ద్వారా అవి తన పార్టీ శత్రుమీడియా సంస్థలు అని కేడర్‌లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఏపీలో ఏ ఛనల్ ఏ పార్టీదో, ఏ పత్రిక ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుందో...ఇరు పార్టీల నేతల ప్రకటన ద్వారా ఖరారు అయిపోయాయి. రాజకీయ పార్టీది జెండా.. అజెండా మీడియాది అనే రేంజ్‌లో ఇరుపార్టీల మధ్య వార్ సాగుతోంది.