500 జ‌నాభా దాటిన ప్ర‌తి పంచాయ‌తీకి కార్యదర్శి.. గ్రామాల్లో క‌ష్టాల‌కు చెక్‌

ప్ర‌స్తుతం రాష్ట్రంలో రెండు, మూడు చిన్న పంచాయతీలు సమీపంలోని పెద్ద పంచాయతీ పరిధిలో పని చేసే క్లస్టర్ విధానం ఉంది.

Advertisement
Update:2024-02-16 08:08 IST

పంచాయ‌తీల్లో ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జనాభా 500 కంటే మించిన ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండేలా ఉత్త‌ర్వులిచ్చింది. ఖాళీలున్న చోట గ్రేడ్-5 కార్యదర్శులను నియ‌మించి, డ్రాయింగ్‌, డిస్బర్స్మెంట్ అధికారాలు క‌ల్పిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది. పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు లేక ప‌క్క పంచాయ‌తీ సెక్ర‌టరీ వ‌చ్చే వ‌ర‌కు ప‌నుల కోసం వేచి ఉండే ప్ర‌జ‌లకు దీంతో ఇబ్బందులు త‌ప్పుతాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు వారానికోసారే అందుబాటులో..

ప్ర‌స్తుతం రాష్ట్రంలో రెండు, మూడు చిన్న పంచాయతీలు సమీపంలోని పెద్ద పంచాయతీ పరిధిలో పని చేసే క్లస్టర్ విధానం ఉంది. మేజ‌ర్ పంచాయ‌తీ ఆఫీస్ సెక్ర‌ట‌రీయే ఆ ప‌రిధిలోని చిన్న చిన్న పంచాయ‌తీల వ్య‌వ‌హారాలు చూస్తున్నారు. ఇలాంటి చిన్న పంచాయ‌తీల‌కు వారంలో ఒక రోజు కంటే ఎక్కువ స‌మ‌యం అత‌ను అందుబాటులో ఉండ‌రు. ఈలోగా ఏదైనా ప‌ని కావాలంటే మేజ‌ర్ పంచాయ‌తీ ఆఫీస్‌కు వెళ్లాల్సిందే.

ప‌నుల కోసం వేచి చూడ‌క్క‌ర్లేదు

తాజా ఉత్త‌ర్వుల ప్ర‌కారం చిన్న పంచాయ‌తీల్లో గ్రేడ్-5 కార్యదర్శులను నియ‌మిస్తారు. ఆ పంచాయ‌తీకి ఆ సెక్ర‌ట‌రీయే డ్రాయింగ్ అండ్ డిస్బ‌ర్స్‌మెంట్ ఆఫీస‌ర్‌. కాబ‌ట్టి నిధుల విడుద‌ల‌కు, వాటిని ఖ‌ర్చు చేయ‌డానికి పెద్ద పంచాయ‌తీ నుంచి సెక్ర‌ట‌రీ వ‌చ్చి సంత‌కం పెట్టే వ‌ర‌కు వేచి చూడ‌క్క‌ర్లేదు. దీనివ‌ల్ల ఎంత చిన్న పంచాయ‌తీలో అయినా ఎప్ప‌టి ప‌నులు అప్పుడు చేసుకోగ‌లిగే వెసులుబాటు ల‌భిస్తుంది.

Tags:    
Advertisement

Similar News