స్కూల్ లో భోగి మంటలు.. విద్యార్థులకు తీవ్ర గాయాలు

భోగిమంటల విషయంలోనే కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. మంటలకోసం పెట్రోల్ బాటిల్ తెచ్చారు ఉపాధ్యాయులు. దాన్ని వాడటంలో నిర్లక్ష్యం కారణంగా మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
Update:2023-01-11 22:22 IST

ఇటీవల ప్రైవేట్ స్కూల్స్ లో ప్రతి పండగను ఘనంగా నిర్వహించడం పరిపాటిగా మారింది. సంప్రదాయాలను, విలువలను పిల్లలకు నేర్పించడం వరకైతే ఓకే. కానీ ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్ల కాంపిటీషన్లో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించడంకోసం, ఈవెంట్ల పేరుతో ఫొటోలు, వీడియోలు తీసి పబ్లిసిటీ చేసుకోవడం కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో భోగిమంటలు అంటుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముగ్గురు పిల్లలు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు.

రేపటి నుంచి సంక్రాంతి సెలవలు, ఈరోజు స్కూల్ లో పండగ.. అంటూ ఆ చిన్నారులు సంబరపడ్డారు. కొత్త బట్టలు వేసుకుని అందంగా ముస్తాబై స్కూల్ కి వచ్చారు. స్కూల్ లో భోగిమంటలు, పిండివంటలు, రంగవల్లులు, గాలిపటాలు అంటూ యాజమాన్యం హడావిడి చేసింది. అయితే భోగిమంటల విషయంలోనే కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. మంటలకోసం పెట్రోల్ బాటిల్ తెచ్చారు ఉపాధ్యాయులు. దాన్ని వాడటంలో నిర్లక్ష్యం కారణంగా మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. అమలాపురంలోని విజ్‌ డమ్‌ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. యూకేజీ చదువుతున్న ఓ బాలుడు, సెకండ్ క్లాస్ బాలిక, థర్డ్ క్లాస్ కి చెందిన మరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అమలాపురంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి విశ్వరూప్‌, ఎంపీ అనురాధ, కలెక్టర్‌ ఆసుపత్రికి వెళ్లి.. బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స కోసం పిల్లలను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.




 యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పిల్లల వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చు తామే భరిస్తామంటూ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ ఘటనపై వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    
Advertisement

Similar News