వర్గీకరణకు చంద్రబాబు స్వాగతం.. వైసీపీ మౌనం

దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతం అని అన్నారు చంద్రబాబు. రామచంద్రరావు కమిటీ వేసి, ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణను తానే తీసుకొచ్చానని గుర్తు చేశారు.

Advertisement
Update:2024-08-01 15:45 IST

ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రెండు తెలుగు రాష్ట్రాల స్పందన వేర్వేరుగా ఉంది. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాయి. ఆ క్రెడిట్ తమదంటే తమదని పోటీ పడుతున్నాయి. ఏపీ విషయానికొస్తే క్రెడిట్ మొత్తం తమదేనంటున్నారు చంద్రబాబు. ఈ విషయంలో వైసీపీ పోటీకి రాలేకపోతోంది. ఎందుకంటే.. వర్గీకరణ అసాధ్యం అని చాన్నాళ్ల క్రితమే జగన్ తేల్చి చెప్పారు. అందుకే ఈరోజు వైసీపీ పూర్తిగా మౌనం వహించింది. కనీసం వైసీపీ నుంచి ఏ ఒక్కరూ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్టు ప్రకటించకపోవడం విశేషం.

దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతం అని అన్నారు చంద్రబాబు. రామచంద్రరావు కమిటీ వేసి, ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణను తానే తీసుకొచ్చానని గుర్తు చేశారు. నేడు సుప్రీం కోర్టు దాన్ని ధృవీకరించిందని, టీడీపీ హయాంలో ప్రతి కులానికి, ప్రతి వర్గానికీ న్యాయం జరుగుతుందన్నారు చంద్రబాబు.


ఎస్సీ వర్గీకరణకోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి న్యాయపోరాటం చేసిన మందకృష్ణ మాదిగ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. వర్గీకరణ చేసి తమకు న్యాయం చేశారంటూ చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణపై తీర్పు వచ్చిన సమయంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం విశేషం అన్నారు మందకృష్ణ.


వైసీపీ ప్రస్తుతానికి ఈ విషయంలో డిఫెన్స్ లో పడింది. సుప్రీంతీర్పుని స్వాగతిస్తే, గతంలో తాము చేసిన ఆరోపణలను తామే వ్యతిరేకించినట్టవుతుంది. అందుకే వైసీపీ నేతలు సైలెంట్ గా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశం లేదని, ఆ నెపంతో చంద్రబాబు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని.. గతంలో జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్ కావడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News