జగన్ హయాంలోనే ఇసుక రేటు ఎక్కువ.. చంద్రబాబు చేసిన తప్పేంటంటే..?

అప్పుడు ఉచితంగా ఇవ్వడం తప్పు అయితే, ఇప్పుడు ట్రక్కు 5వేల రూపాయలకు అమ్ముకుంటున్న జగన్ చేస్తోంది ఒప్పు ఎలా అవుతుందని లాజిక్ తీస్తున్నారు టీడీపీ నేతలు. ఒకరకంగా వైసీపీ దగ్గర లాజికల్ ఆన్సర్ లేదు. కానీ చంద్రబాబు అప్పుడు చేసిన తప్పు ఆన్ రికార్డ్ ఉండటంతో కేసు తప్పలేదు.

Advertisement
Update:2023-11-03 08:26 IST

రాజకీయాలతో పనిలేదు కానీ.. సామాన్య జనం ఎవరికైనా ఇసుక రేటు ఎప్పటినుంచి పెరిగిందో బాగా తెలుసు. చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకున్నా.. ట్రక్కు వెయ్యిరూపాయలకు దొరికేది. ఓ దశలో 2వేలకు కూడా చేరింది. కానీ జగన్ వచ్చాక ఇసుక ట్రక్కు 5వేల రూపాయలకు తగ్గలేదు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ఇందులో అనుమానమేం లేదు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని సొంత పార్టీ కార్యకర్తలు కూడా తిట్టుకుంటారనడంలో సందేహం లేదు. మరి చంద్రబాబు చేసిన ఇసుక కుంభకోణం ఏంటి..? ఇప్పుడాయనపై సీఐడీ కేసు పెట్టడానికి కారణం ఏంటి..? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ఎల్లో మీడియా కూడా ఇదే విషయంపై రాద్ధాంతం చేస్తుంది. ఇసుక ఉచితంగా ఇచ్చిన చంద్రబాబుపై కేసు పెట్టడాన్ని ప్రశ్నిస్తోంది. అప్పుడు ఉచితంగా ఇవ్వడం తప్పు అయితే, ఇప్పుడు ట్రక్కు 5వేల రూపాయలకు అమ్ముకుంటున్న జగన్ చేస్తోంది ఒప్పు ఎలా అవుతుందని లాజిక్ తీస్తున్నారు టీడీపీ నేతలు. అప్పుడెప్పుడో తప్పు జరిగితే నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు కేసేంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ హయాంలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయంటూ టీడీపీ నేతలు సీబీఐకి ఫిర్యాదు చేసిన తర్వాత ప్రతీకారంతో సీఐడీ ద్వారా కేసు పెట్టించారని అంటున్నారు. ఒకరకంగా వైసీపీ దగ్గర లాజికల్ ఆన్సర్ లేదు. కానీ చంద్రబాబు అప్పుడు చేసిన తప్పు ఆన్ రికార్డ్ ఉండటంతో కేసు తప్పలేదు.

చంద్రబాబు చేసిన తప్పేంటంటే..?

టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలు జరిపించారు. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. విమర్శలు రావడంతో చంద్రబాబు తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. 2016 మార్చి 4నుంచి కొత్త ఇసుక విధానం తెచ్చారు. ఇసుక పూర్తి ఉచితం అన్నారు. అయితే అప్పటికే ఇసుక కోసం పోర్టల్‌ లో బుక్‌ చేసుకుని డబ్బులు చెల్లించిన వారికి అన్యాయం జరిగింది. వారు తమకు డబ్బులు తిరిగివ్వాలన్నారు. దీనికోసం 2016–17లో సెర్ప్‌ సంస్థ రూ.35.52 కోట్లను విడుదల చేయగా రూ.13.57 కోట్ల వరకు డబ్బు చెల్లించినవారికి రీఫండ్‌ చేశారు. మిగతా డబ్బులు మిగుల్చుకున్నారు. 2017 ఫిబ్రవరిలో ఇసుక బుకింగ్‌ చేసుకున్న వారికి రీఫండ్‌ చేసేందుకు మరో రూ.25.55 కోట్లను సెర్ప్‌ విడుదల చేసింది. ఇక్కడే మతలబు జరిగింది. రీఫండ్‌ కోసం అప్పటికే విడుదల చేసిన నిధులు మిగిలి ఉండగా మళ్లీ డబ్బులు విడుదల చేయడాన్ని కాగ్‌ తప్పుబట్టింది. రీఫండ్‌ కి సంబంధించి రూ.47.5 కోట్లకు లెక్కలు చెప్పాలని అడిగితే గత సర్కారు చెప్పకుండా తప్పించుకుందని కాగ్‌ స్పష్టం చేసింది. ఈ లావాదేవీలపైనే ఇప్పుడు కేసు నమోదైంది. 

Tags:    
Advertisement

Similar News