ఆ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర.. - ప్రభుత్వ సలహాదారు సజ్జల

స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన స్కామ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాత్రను కొట్టిపారేయలేమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement
Update:2022-12-05 16:36 IST

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఈడీ ఇటీవల పలువురికి నోటీసులు జారీ చేసింది. ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారులు, అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన‌వారు ఉన్నారు. కాగా ఈ కేసుపై తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన స్కామ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాత్రను కొట్టిపారేయలేమని ఆయన వ్యాఖ్యానించారు.

కోట్ల రూపాయల డబ్బు చేతులు మారింది కాబట్టి.. అప్పడు ఆ శాఖ చూస్తున్న లోకేశ్ కూడా ఈ కేసులో కార్నర్ అవుతారని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉన్నందున తాను ఎక్కువగా మాట్లాడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు చంద్రబాబుపై కూడా సజ్జల తీవ్ర ఆరోపణలు చేశారు. రాయలసీమ అభివృద్ధికి ఆయన అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కర్నూలుకు హైకోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం టెక్నికల్‌గా హైకోర్టు అమరావతిలోనే ఉందని.. ఇదే విషయాన్ని ప్రభుత్వ తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో వాదించారని చెప్పారు. కానీ ఈ విషయాన్ని ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని చంద్రబాబు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేవలం ద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారు తప్ప .. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News