కుప్పంలో సిగ్గులేని డ్రామాలు.. బాబుపై సజ్జల ధ్వజం

Advertisement
Update:2022-08-25 18:35 IST

కుప్పంలో ఈ రోజు బాగా హడావిడి జరిగింది. వైసీపీ శ్రేణులు ఓ వైపు, టీడీపీ శ్రేణులు ఓ వైపు, మధ్యలో పోలీసులు.. ఇలా ఈ రోజంతా కుప్పం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. అన్న క్యాంటీన్ ఏర్పాట్లను టీడీపీ అడ్డుకుందని, పేదల నోటి దగ్గర కూడు లాగేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తమపై హత్యాయత్నం చేయబోయారంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మొత్తమ్మీద కుప్పంలో ఈ రోజు చంద్రబాబు హడావిడి చేశారు. రోడ్డుపై కూర్చుని ఆయన వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఇదంతా వట్టి డ్రామా అంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కుప్పంలో చంద్రబాబు సిగ్గు లేకుండా డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ఆవేశం చూస్తే కుప్పంలో ఏదో జరిగిపోతోందని భ్రమప‌డేలా ఉందని ఎద్దేవా చేశారు సజ్జల. ప్ర‌శాంతంగా ఉన్న గ్రామంలో చంద్రబాబు గొడవ పెట్టారన్నారు. అసలు చంద్రబాబు చేసేది రాజకీయమేనా అని ప్ర‌శ్నించారు. జనాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో నిజమైన అభివృద్ధిని కుప్పం ప్రజలు కూడా చూడగలిగారని చెప్పారు.

మెయిన్ యాక్టర్, సైడ్ యాక్టర్..

రాజకీయం అంటే లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్ అని చెప్పడం కాదని.. చంద్రబాబుకి ఇప్పుడు ఇంకో నటుడు తోడయ్యాడని పరోక్షంగా పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు సజ్జల. వీరిద్దరూ కలిసి చిల్లర వేషాలు వేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోనే కాదు, కుప్పంలో కూడా చంద్రబాబు రిజెక్ట్ అయ్యార‌ని మండిపడ్డారు. చంద్రబాబు చుట్టపు చూపుగా వెళ్లి కుప్పంలో ఆఫీస్ ఓపెన్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. 14 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు కుప్పం అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు సజ్జల.

Tags:    
Advertisement

Similar News