వాలంటీర్లపై ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలి -సజ్జల

వైసీపీ నేతలు వాలంటీర్లకు అండగా నిలబడాలని, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Advertisement
Update:2023-07-16 22:23 IST

ఏపీలో వాలంటీర్ల వ్యవహారం రాజకీయ సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ ముందుగా వాలంటీర్లను టార్గెట్ చేశారు. ఆ తర్వాత బీజేపీ మద్దతిచ్చింది, ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ కూడా వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తోందని, పార్టీ మనుషులుగా వారిని ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా వాలంటీర్లను పూర్తిగా కార్నర్ చేసింది. వారికి సంబంధించి ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా, నేరుగా వాలంటీర్లకు లింకు పెడుతూ వార్తల్ని వండి వారుస్తోంది. ఈ దశలో వైసీపీ నేతలు వాలంటీర్లకు అండగా నిలబడాలని, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.

175మనవే..

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175కి 175 సీట్లు గెలుచుకునే వాతావరణం ఉందని ధీమా వ్యక్తం చేశారు సజ్జల. పార్టీ ఎమ్మెలేలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. ఎన్నికలకింకా 9 నెలలు మాత్రమే సమయం ఉందని, పార్టీకి ఇక ప్రతి రోజూ కీలకమేనని చెప్పారు. ఎంఎల్ఏలకు, కోఆర్డినేటర్లకు పార్టీ పరిశీలకులు సంధానకర్తలుగా క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రచారానికి ప్రాధాన్యత..

ప్రజలకు చేస్తున్న మంచిని ప్రచారం చేసుకుంటేనే పార్టీకి ఉపయోగం అని చెప్పారు సజ్జల. ఇప్పటి వరకూ జరిగిన మంచి గురించి ప్రజలకు తెలుసని, కొత్తగా చేస్తున్న మంచిని మరింత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు సజ్జల. అసైన్డ్ భూములు, చుక్కల భూములు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల జరుగుతున్న మేలుని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్నారు. ఓటర్ల జాబితా సవరణల్లో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని, దొంగఓట్ల తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో చురుకుగా ఉండాలని నాయకులకు సూచించారు సజ్జల.

Tags:    
Advertisement

Similar News