మా వాళ్లు మీ ఇంటికొస్తారు, 10నిమిషాలు కేటాయించండి

జగన్ ఇచ్చిన మెసేజ్ ని వారు ప్రజలకు అందించి వెళ్తారన్నారు. అన్ని కులాలు, మతాలు, ఇతర రాజకీయ కుటుంబాలను కూడా గృహసారథులు కలుస్తారని చెప్పారు.

Advertisement
Update:2023-04-06 15:50 IST

ఏపీలో రేపటినుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మొదలు కాబోతోంది. ఇప్పటికే గడప గడప పేరుతో ఎమ్మెల్యేలను జనం మధ్యకి పంపిస్తున్నా.. ఇంకా ఏదో కావాలని ఆలోచించారు సీఎం జగన్. ఐప్యాక్ ఆలోచనని పట్టాలెక్కించారు. అసలు జనం ఏమనుకుంటున్నారనే విషయాన్ని ప్రభుత్వమే ఓ సర్వే రూపంలో తెలుసుకోవాలన్నదే ఈ కొత్త కార్యక్రమం. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా గృహసారథులను కూడా నియమించారు. రేపటినుంచి గృహసారథులతోపాటు, స్థానిక నేతలు, సచివాలయ కన్వీనర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తారు.

10నిమిషాలు కేటాయించండి..

రేపటి నుంచి ఏడు లక్షల మంది గృహ సారథులు రాష్ట్రంలోని 1.6 కోట్ల ఇళ్లకు వెళ్తారని చెప్పారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జగనన్న దూతలుగా వారు మీ ఇంటికి వస్తారు, వారు వచ్చినప్పుడు 10నిమిషాలు వారికి కేటాయించండి అని పిలుపునిచ్చారు. జగన్ ఇచ్చిన మెసేజ్ ని వారు ప్రజలకు అందించి వెళ్తారన్నారు. అన్ని కులాలు, మతాలు, ఇతర రాజకీయ కుటుంబాలను కూడా గృహసారథులు కలుస్తారని చెప్పారు. గతంలో పాలన ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా జరుగుతోంది..? అనే విషయాలపై వారు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారని వివరించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినప్పుడు ఐదు ప్రశ్నలు వేస్తారని, ఆ సమాధానాలను వారు క్రోడీకరిస్తారని అన్నారు.

ఈ ధైర్యం ఎవరికుంది..?

దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత ధైర్యంగా తాము చేసిన మంచిని చూసి ఓట్లు వేయమని ప్రజలను అడగలేదని, ఆ ధైర్యం కేవలం జగన్ కి మాత్రమే ఉందన్నారు సజ్జల. దేశంలో ఎవరూ చేయని కార్యక్రమం తమ పార్టీ చేస్తుందని చెప్పారు. నాలుగేళ్లలో ప్రభుత్వ సాయం అందితేనే తనకు ఓటేయాలని జగన్ అడుగుతున్నారని చెప్పారు. గతంలో జన్మభూమి కమిటీ జలగలు ప్రజల్ని పీడించాయని, ఇప్పుడు లంచాలకు తావు లేకుండా అర్హతే ప్రమాణంగా సంక్షేమం అందిస్తున్నామన్నారు సజ్జల. 

Tags:    
Advertisement

Similar News