సీఎం రేసులో లేనన్న పవన్.. కుక్క తోక కథ చెప్పిన సజ్జల
పవన్ కల్యాణ్ ఇమేజ్ ఒక నీటి బుడగ అని అన్నారు సజ్జల. పవన్ కు ఇమేజ్ ఉన్నట్టుగా ఏపీలో ప్రచారం జరుగుతోందని, చంద్రబాబు కొన్ని మీడియా సంస్థల సహాయంతో ఇలాంటి వ్యవహారం నడిపిస్తున్నారని చెప్పారు.
సీఎం రేసులో తాను లేను, కండిషన్లు పెట్టను అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. టీడీపీ, జనసేన పొత్తుని కూడా దాదాపు ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు కాస్త కంగారు పడినా, పవన్ వాలకం తెలిసి సరిపెట్టుకున్నారని తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ నుంచి మాత్రం విమర్శల ఘాటు పెరిగింది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుక్క తోకను ఆడించగలదు.. కానీ, తోక కుక్కను ఆడించ లేదు అని అన్నారాయన.
పవన్ కల్యాణ్ ఇమేజ్ ఒక నీటి బుడగ అని అన్నారు సజ్జల. పవన్ కు ఇమేజ్ ఉన్నట్టుగా ఏపీలో ప్రచారం జరుగుతోందని, చంద్రబాబు కొన్ని మీడియా సంస్థల సహాయంతో ఇలాంటి వ్యవహారం నడిపిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పల్లకి మోయటమే తన ఎజెండా అని పవన్ స్పష్టత ఇచ్చారని.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేయలేమని పవన్ చేతులెత్తేశారని చెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా 2019లో అందరూ గుంపుగా వచ్చారని, మరోసారి పవన్ ఆ ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.
సీఎం కావాలనే చంద్రబాబు కలనే పవన్ కల్యాణ్ కూడా కంటున్నాడని సెటైర్లు వేశారు సజ్జల. తనకు బలం లేదని పవన్ అంగీకరించారని ఎద్దేవా చేశారు. పవన్ ని ముఖ్యమంత్రిగా చూడాలనే అభిమానుల ఆశను ఆయన చంపేశారని, వారి అభిమానాన్ని చంద్రబాబు వద్ద తాకట్టుపెడుతున్నాడని అన్నారు.
పవన్ వ్యాఖ్యలతో కలకలం..
ఇన్నాళ్లూ పవన్ సీఎం అంటూ జనసైనికులు ఎంత హడావిడి చేశారో అందరికీ తెలుసు. కానీ ఒక్కసారిగా ఆ ఆశలపై పవన్ నీళ్లు చల్లారు. గత ఎన్నికల్లో తాము 137 స్థానాల్లో పోటీ చేశామని కనీసం 30-40 స్థానాల్లో గెలిచి ఉంటే.. సీఎం స్థానం కోసం డిమాండ్ చేయగలిగేవారమని చెప్పుకొచ్చారు. నన్ను సీఎం చేయండి అని ఇప్పుడు తాను ఏ పార్టీని అడగబోనని, తన సత్తా చూపించే అడుగుతానన్నారు. పవన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి.