ఏపీ పోలీస్ వ్యవస్థపై RS ప్రవీణ్ ఫైర్
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐపీఎస్ అధికారులను వెయిటింగ్ రూమ్‌లో వేచి ఉండాలని చెప్పడం, రోజూ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని చెప్పడంపై RSP తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏపీలో పోలీస్ వ్యవస్థ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్. గత నెలలో ఇద్దరు డీజీపీ స్థాయి అధికారులపై క్రిమినల్ కేసు, 16 మంది ఐపీఎస్ అధికారులను రెండు నెలలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిట్ చేయించడంపై RSP తీవ్రస్థాయిలో స్పందించారు. 16 మంది ఐపీఎస్ అధికారులకు బుధవారం మెమోలు జారీ చేసిన తీరు పుండు మీద కారం చల్లినట్లుగా ఉందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐపీఎస్ అధికారులను వెయిటింగ్ రూమ్‌లో వేచి ఉండాలని చెప్పడం, రోజూ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని చెప్పడంపై RSP తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆదేశాలు పూర్తిగా కక్షసాధింపు, అర్థం లేనివంటూ మండిపడ్డారు.
16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఓ గదిలో ఉండి ఏం చేస్తారని ప్రశ్నించారు RSP. ముచ్చట్లు పెట్టాలా లేదా ధ్యానం చేయాలా అంటూ ప్రశ్నించారు. లేదా ఒకరి భుజంపై ఒకరు పడి ఏడవాలా..? లేదా సైకాలజీలో స్టాన్‌ఫోర్డ్ స్టైల్ పరిశోధనకు గినియా పిగ్స్‌లా వేచి ఉండాలా అంటూ ఫైర్ అయ్యారు. వీరందరికి తర్వాత పోస్టింగ్స్ ఇచ్చినప్పటికీ వెయిట్ చేసిన కాలానికి జీతాలు తీసుకుంటారని, అలాంటప్పుడు వారిని అర్థవంతంగా ఎందుకు ఉపయోగించుకోరని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సీనియర్ పోలీసు అధికారులను వేచి ఉండేలా చేయడం అంటే ప్రజా ధనాన్ని పూర్తిగా వృథా చేయడమేనన్నారు RSP. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఒక రూమ్‌లో బంధించడం అంటే అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకోవడం కన్నా తక్కువేమి కాదన్నారు. ఉమ్మడి ఏపీలోనూ, ప్రస్తుతం తెలంగాణలోనూ ఇలాంటి క్రూరమైన విధానం గురించి ఎప్పుడూ వినలేదన్నారు. కనీసం హోంగార్డుల విషయంలోనూ ఇలా ప్రవర్తించలేదన్నారు. కానీ పరిస్థితులు మారిపోయాయన్న RSP.. గొంతు లేని వారికే అన్యాయం జరుగుతోందని, ఇది దురదృష్టకరంటూ ట్వీట్ చేశారు.