ఎమ్మెల్యే అనిల్ కి రూప్ కుమార్ మాస్ వార్నింగ్..

తాము ప్రతిదాడులు చేస్తే తట్టుకోలేవు అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే అండదండలతోనే ఆయన అనుచరులు పెట్రేగిపోతున్నారని అన్నారు.

Advertisement
Update:2023-05-20 11:45 IST

నెల్లూరు రచ్చ మరోసారి సీఎం జగన్ కి తలనొప్పిగా మారింది. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మధ్య గొడవ ఇప్పుడు రోడ్డునపడింది. రూప్ కుమార్ యాదవ్ అనుచరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి దాడి చేశారు. ఆస్పత్రికి వెళ్లి అతడిని పరామర్శించిన రూప్ కుమార్.. ఎమ్మెల్యే అనిల్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాము ప్రతిదాడులు చేస్తే తట్టుకోలేవు అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే అండదండలతోనే ఆయన అనుచరులు పెట్రేగిపోతున్నారని అన్నారు. వారిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.

పదిమంది చిల్లరగాళ్లను పక్కనపెట్టుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని, వారికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు రూప్ కుమార్ యాదవ్. పోలీసులు తమపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని, తాము కూడా అధికార పార్టీ నాయకులమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇంతవరకు ఓపిక పట్టి సహనం వహించానని, పార్టీని కాపాడుకోడానికి తాను ఎంతకైనా సిద్ధమేనని హెచ్చరించారు రూప్ కుమార్ యాదవ్.

జగన్ చెప్పినా ససేమిరా..

ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ ఎన్నికల సమయంలో బాగానే ఉన్నారు. అనిల్ కి మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా వారిద్దరూ కొంతకాలం సఖ్యతగానే ఉన్నారు. మంత్రి పదవి పోయే సమయంలో వారి మధ్య విభేదాలొచ్చాయి. రెండు వర్గాలయ్యాయి. అనిల్ కి వ్యతిరేకంగా రూప్ కుమార్, కొంతమంది కార్పొరేటర్లను తనవైపు తిప్పుకున్నారు. ఈ క్రమంలో అనిల్ కూడా గతంలో రూప్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నెల్లూరు జిల్లా కావలి పర్యటనకు వచ్చిన సీఎం జగన్.. అనిల్, రూప్ చేతుల్ని కలిపి సెటిల్మెంట్ చేశారు. కానీ వారిద్దరూ తగ్గేదే లేదంటున్నారు. జగన్ చెప్పినా తాను రూప్ తో కలవబోనని ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మరీ అనిల్ తేల్చేశారు. తనజోలికొస్తే, ఇక సహించేది లేదని తానేంటో చూపిస్తానని రూప్ ఇప్పుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

బాబాయ్, అబ్బాయ్ గొడవల్లో నెల్లూరు సిటీ వైసీపీలో విభేదాలు పూర్తిగా రచ్చకెక్కాయి. ఈ గొడవలు అనిల్ సీటు కిందకి నీళ్లు తెచ్చేలా కనపడుతున్నాయి. అనిల్ కి టికెట్ రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే రూప్ వర్గం పనిచేస్తోందని అంటున్నారు. మరి ఈ పంచాయితీని సీఎం జగన్ మరోసారి పరిశీలిస్తారా...? లేక మధ్యేమార్గాన్ని అన్వేషిస్తారా..? తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News