వెంట్రుక కూడా పీకలేవు పవన్.. రోజా వార్నింగ్
పవన్ కల్యాణ్ తల్లి గురించి ప్రస్తావించినందుకు క్షమించాలి అంటూనే విమర్శలతో విరుచుకుపడ్డారు. వాలంటీర్ల గురించి మాట్లాడితే పళ్లు రాలగొడ్తారు అంటూ హెచ్చరించారు రోజా.
పవన్ కల్యాణ్ కి మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు. వాలంటీర్ల కాళ్లు పట్టుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతో వాళ్లే పవన్ సంగతి తేలుస్తారని హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పవన్ పీకలేరని అన్నారు. పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కాదని, ఇరిటేషన్ స్టార్ అని, రెండు రోజులుగా వాలంటీర్లను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని మండిపడ్డారు రోజా.
మహిళల అక్రమ రవాణా వాలంటీర్ల వల్లే జరుగుతుందంటూ పవన్ మాట్లాడటం సిగ్గుచేటని చెప్పారు రోజా. వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని పవన్ కు ఏ నిఘా వర్గాలు ఆ సమాచారం ఇచ్చాయని ప్రశ్నించారు. సాక్షాత్తు ముస్సోరిలోని IAS శిక్షణ కేంద్రంలో వాలంటీర్ వ్యవస్థను సిలబస్ లో చేర్చారని చెప్పారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ సచివాలయానికి వెళ్లినా వాలంటీర్ల పనితీరు గురించి ఏ అక్కచెల్లెమ్మని అడిగినా గొప్పగా చెబుతారన్నారు రోజా.
55 ఏళ్లు వచ్చినా కనీసం ఎంపీటీసీగా కూడా పవన్ గెలవలేదని, కానీ సీఎంని ఏక వచనంతో మాట్లాడతానంటున్నారని.. ఆయనకు తల్లి నేర్పిన సంస్కారం అదేనా అని ప్రశ్నించారు రోజా. పవన్ కల్యాణ్ తల్లి గురించి ప్రస్తావించినందుకు క్షమించాలి అంటూనే విమర్శలతో విరుచుకుపడ్డారు. వాలంటీర్ల గురించి మాట్లాడితే పళ్లు రాలగొడ్తారు అంటూ హెచ్చరించారు రోజా. జనసేన వాళ్లను అలగా జనం అని కించపరిచిన బాలకృష్ణ పిలిస్తే పవన్ పరిగెత్తుకుంటూ ఇంటర్వ్యూకి వెళ్లారని ఎద్దేవా చేశారు. అసలు సీఎం జగన్ ఎప్పుడైనా పవన్ కుటుంబ సభ్యుల పేర్లు ఎత్తారా అని ప్రశ్నించారు రోజా.