ఓవరాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుందా?

దర్యాప్తున‌కు వచ్చిన అధికారులను అడ్డుకోవటం అన్నది చాలా పెద్ద క్రైమన్న విషయం రామోజీకి ఎవరు చెప్పక్కర్లేదు. ఇలాంటి అనేక విధాలుగా ఓవర్ యాక్షన్ చేసిన ఫలితంగానే వీళ్ళిద్దరినీ మూడోసారి విచారణకు సీఐడీ తమ ఆఫీసుకే రమ్మని నోటీసులిచ్చింది.

Advertisement
Update:2023-06-23 11:23 IST

మార్గదర్శి చీటింగ్ కేసులో ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజను జూలై 5వ తేదీన విచారణకు హాజరవ్వాలని సీఐడీ నోటీసులు జారీచేయటం సంచలనంగా మారింది. విచారణకు హాజరవ్వాలన్న విషయం సంచలనంకాదు. గుంటూరులోని సీఐడీ రిజనల్ ఆఫీసులో విచారణకు హాజరవ్వాలని నోటీసులు అందటమే సంచలనం. ఇప్పటికే సీఐడీ రెండు సార్లు రామోజీరావు, శైలజ ఇంటికే వెళ్ళి విచార‌ణ‌ చేసింది. అంటే ఇందుకు రెండు కారణాలున్నాయి.

మొదటిదేమో రామోజీ వయసు 86 ఏళ్ళు. అలాగే శైలజ మహిళ కావటం రెండో కారణం. రామోజీ అనారోగ్యాన్ని, వయసును, అలాగే మహిళన్న కారణంగా శైలజతో సీఐడీ మర్యాదగనే వ్యవహరించింది. వీళ్ళని తమ ఆఫీసుకే విచారణకు హాజరవ్వాలని చెప్పే అవకాశం ఉన్నా, కాదని దర్యాప్తు అధికారులే వీళ్ళింటికి వెళ్ళి విచారించారు. ఎప్పుడైతే సీఐడీ అధికారులు తమింటికి వచ్చారో వీళ్ళిద్దరు బాగా ఓవరాక్షన్ చేశారు.

ఇద్దరు కూడా విచారణకు సహకరించలేదు. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో చాలావాటికి ఇద్దరూ సమాధానాలే చెప్పలేదు. చట్టవిరుద్ధంగా నిధుల దారి మళ్ళింపు, డిపాజిట్ల సేకరణ, చిట్టేతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సీఐడీ విచారణలో అంగీకరించినట్లు జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్పింది. అయితే ఇదే సమయంలో శైలజ చాలా పెడసరంగా సమాధానాలిచ్చినట్లు సీఐడీ అధికారులు చెప్పారు. ఎండీగా ఉంటూ సంస్థ‌ నిధులు ఎక్కడికి దారిమళ్ళాయో గుర్తులేదన్నారట. దారిమళ్ళింది వాస్తవమే కానీ ఎన్నినిధులు దారిమళ్ళిందనే సమాచారం లేదన్నారట.

ఎండీగా ఉండి నిధులు ఎక్కడికి దారి మళ్ళిందో సమాచారం లేదంటే ఎవరైనా ఎలా నమ్ముతారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా తమ సొంత విధానాల ప్రకారమే సంస్థ‌ను నడుపుకుంటామన్నారట. చివరకు దర్యాప్తుకు వచ్చిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులను ఇంట్లోకి అడుగుపెట్టకుండా మార్గదర్శి సిబ్బంది అడ్డుకున్నారు. అధికారులకు యాజమాన్యం సిబ్బందికి దాదాపు గంటకుపైగా రోడ్డు మీద వాగ్వాదం జరిగింది. దర్యాప్తున‌కు వచ్చిన అధికారులను అడ్డుకోవటం అన్నది చాలా పెద్ద క్రైమన్న విషయం రామోజీకి ఎవరు చెప్పక్కర్లేదు. ఇలాంటి అనేక విధాలుగా ఓవర్ యాక్షన్ చేసిన ఫలితంగానే వీళ్ళిద్దరినీ మూడోసారి విచారణకు సీఐడీ తమ ఆఫీసుకే రమ్మని నోటీసులిచ్చింది. మరి విచారణకు వెళతారా? లేకపోతే కోర్టుకు వెళ్తారా అన్నది చూడాలి.

Tags:    
Advertisement

Similar News