తొలి జాబితా చిచ్చు.. టీడీపీ, జనసేనల్లో ఎగిసిపడుతున్న ఆగ్రహ జ్వాలలు
తూర్పు గోదావరి జిల్లాలో కూడా చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టారు. రాజానగరంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి చంద్రబాబు మొండిచేయి చూపారు.
టీడీపీ, జనసేన తొలి జాబితా ఇరు పార్టీల్లోనూ చిచ్చు పెట్టింది. రెండు పార్టీల్లోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టీడీపీ, జనసేనల్లో రాజీనామాల పర్వం కూడా మొదలైంది. టీడీపీ తొలి జాబితాలో పలువురు సీనియర్లకు సీట్ల కేటాయింపు జరగలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ వంటివారికి తొలి జాబితాలో చోటు దక్కలేదు. మరో టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుకు స్థానం దక్కలేదు. దీంతో విజయనగరంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
కళా వెంకట్రావ్‌ను వ్యతిరేకించిన కొండ్రు మురళికి మాత్రం రాజాం టికెట్ దక్కింది. గజపతినగరంలో మాజీ ఎమ్యెల్యే అప్పలనాయుడికి షాక్ తగిలింది. గజపతినగరం టీడీపీ టికెట్ కొండపల్లి శ్రీనివాస్‌కు దక్కింది. దీంతో చంద్రబాబు తీరుపై అప్పలనాయుడి వర్గం భగ్గుమంటోంది. గజపతినగరం టీడీపీ ఇంచార్జీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
క్రాస్ రోడ్డులో బుచ్చయ్య చౌదరి
తూర్పు గోదావరి జిల్లాలో కూడా చంద్రబాబు సీనియర్లను పక్కన పెట్టారు. రాజానగరంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి చంద్రబాబు మొండిచేయి చూపారు. రాజమండ్రి రూరల్ స్థానంపై టీడీపీ, జనసేన మధ్య స్పష్టత రాలేదు. దాంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్రాస్ రోడ్డులో నించున్నారు. ముమ్మిడివరం స్థానానికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కొత్తపేట నియోజకవర్గం పరిస్థితి కూడా అదే.
ఆలపాటి రాజాకు షాక్
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టేశారు. ఆలపాటి రాజాకు, యరపతినేని శ్రీనివాస్‌కు చంద్రబాబు టికెట్లు కేటాయించలేదు. ఆలపాటి రాజాకు షాక్ ఇస్తూ తెనాలి టికెట్‌ను జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు. పెదకూరపాడు, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్, వెస్ట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.
చింతలపూడి టికెట్‌ను స్థానికేతరుడికి కేటాయించడంతో టీడీపీ శ్రేణుల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఆశాభంగం కలిగింది. తణుకు సీటుపై పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినా కూడా రామచంద్రరావుకు టికెట్ దక్కలేదు. తాడేపల్లిగూడెం, నర్సాపురం స్థానాలకు సంబంధించి టీడీపీ, జనసేన మధ్య సయోధ్య కుదరలేదు. ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన నేత రెడ్డప్ప నాయుడికి షాక్ తగిలింది.
రాజీనామాకు సిద్ధపడిన రమేష్ రెడ్డి
కడపలో అమీర్‌బాబు, ఉమాదేవీలకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డికి, ద్వారకానాథ్ రెడ్డికి ఆశాభంగమే కలిగింది. దీంతో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు.
విభేదాల కారణంగా చంద్రబాబు జమ్మలమడుగు, కమలాపురం సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. రాజంపేట, రైల్వే కోడూరుల్లో టీడీపీ, జనసేన మధ్య సయోధ్య కుదరలేదు. తంబళ్లపల్లి మాజీ ఎమ్యెల్యే శంకర్‌కు మొండిచేయి చూపారు. చిత్తూరు సీటును తమకు కేటాయించకపోవడంతో సీకే బాబు వర్గం అలక వహించింది. శ్రీకాళహస్తి సీటుపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు.
చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసిన హనుమంతరాయ చౌదరి వర్గం
అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. కల్యాణదుర్గం టికెట్‌ను చంద్రబాబు కాంట్రాక్టర్ సురేంద్రబాబుకు కేటాయించారు. దీంతో హనుమంతరాయ చౌదరి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసింది.
అనకాపల్లిలో దాడి వీరభద్రరావు, దాడి రత్నాకర్‌లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. అనకాపల్లి సీటను జనసేన నేత కొణతాల రామకృష్ణకు కేటాయించారు. దాంతో దాడి వీరభద్ర రావు వర్గం మండిపోతోంది. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని విమర్శిస్తోంది.
ఆనందగా ఉన్నానని బుద్ధప్రసాద్ వ్యాఖ్య
తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై అవనిగడ్డ ఇంచార్జీ మండలి బుద్ధప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్ ప్రకటించకపోవడం పట్ల ఆనందంగా ఉన్నానని ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయిస్తున్నట్లు సమాచారం.