జగన్ కి తలనొప్పి తగ్గించిన ఆ ఇద్దరు నేతలు
జగన్ ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారనే వార్తల నేపథ్యంలో అటు గొల్లపల్లి, ఇటు రాపాక ఇద్దరూ సర్దుబాటు చేసుకున్నారు. గొడవలు ముదిరితే ఇద్దరికీ సీట్లు క్యాన్సిల్ అవుతాయనే భయంతో సంధికి వచ్చారు.
నిన్న మొన్నటి వరకు ఉప్పు-నిప్పుగా ఉన్న వారిద్దరూ ఇప్పుడు కలసిపోయారు. జగన్ ఆగ్రహానికి గురికాకుండా కాస్త ముందుగానే తప్పించుకున్నారు. దీంతో ఆ ఇద్దరి స్థానాలు ఇప్పుడు సేఫ్ అని తేలిపోయింది. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం ఎంపీ స్థానం నుంచి టికెట్ ఖరారైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇద్దరూ కలసి మెలసి పనిచేస్తామని అంటున్నారు. ఒకరి గెలుపుకోసం మరొకరు పనిచేస్తామని చెప్పారు.
జనసేన నుంచి వచ్చి వైసీపీలో చేరిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తిరిగి అదే సీటు ఆశించారు. కానీ ఆ స్థానంలో గొల్లపల్లి సూర్యారావుకి అవకాశం ఇచ్చింది వైసీపీ అధిష్టానం. రాపాకకు అమలాపురం ఎంపీ సీటు చూపించింది. కానీ ఆయనకు అమలాపురం వెళ్లడం ఇష్టం లేదు, పోనీ ఆ విషయంలో అడ్జస్ట్ అయిపోయినా, తన సీటులో గొల్లపల్లి పోటీ చేయడం రాపాకకు అసలు ఇష్టం లేదు. దీంతో రాజోలు అభ్యర్థిని మార్చాలంటూ అనుచరులతో కలసి రెండు రోజులుగా రాద్ధాంతం చేస్తున్నారు. దీన్ని ఎల్లో మీడియా బాగా హైలైట్ చేయడం జగన్ కి ఇబ్బందిగా మారింది. టికెట్లు కన్ఫామ్ అయిన తర్వాత ఇద్దరూ ఇలా రోడ్డున పడటం ఏంటని జగన్ సహా కీలక నేతలు అసహనం వ్యక్తం చేశారు.
ఇక జగన్ ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారనే వార్తల నేపథ్యంలో అటు గొల్లపల్లి, ఇటు రాపాక ఇద్దరూ సర్దుబాటు చేసుకున్నారు. గొడవలు ముదిరితే ఇద్దరికీ సీట్లు క్యాన్సిల్ అవుతాయనే భయంతో సంధికి వచ్చారు. ఈ రోజు స్వయంగా తనకు తానే గొల్లపల్లి సూర్యారావు ఇంటికి వెళ్లి కలిశారు రాపాక. రాజోలులో గొల్లపల్లి గెలుపుకోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. గొల్లపల్లి కూడా రాపాకతో చేతులు కలిపారు. ఐదేళ్లు రాజోలు నియోజకవర్గంలో రాపాక చేసిన కృషికి ప్రమోషన్‌గా పార్లమెంట్ కి వెళ్లే అవకాశం ఆయనకు లభించిందన్నారు గొల్లపల్లి సూర్యారావు. 30 ఏళ్లుగా కోనసీమ ప్రాంతంలో ప్రజల కోసం పనిచేశామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు గొల్లపల్లి.