రాజమండ్రి జైలులో దోమలపై దండయాత్ర

రాజమండ్రి జైలులో ఫాగింగ్ చేశామని, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయని, నీరు నిల్వ లేదని, దోమలు ఉండేందుకు ఆస్కారం లేదని అధికారులు ప్రకటించారు. చంద్రబాబుతో సహా ఖైదీలందరి ఆరోగ్యం, భద్రత తమ లక్ష్యమని చెప్పారు.

Advertisement
Update:2023-09-21 21:58 IST

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర అనే కార్యక్రమం చేపట్టారు. విధి విచిత్రం.. ఇప్పుడు ఆయన ఉన్న జైలులో కూడా దోమలపై దండయాత్ర చేపట్టారు అధికారులు. అలా ఆయన చేపట్టిన కార్యక్రమమే ఇప్పుడు అధికారులకు కూడా ఆదర్శంగా నిలవడం విశేషం. రాజమండ్రి జైలులో ఫాగింగ్ చేశామని, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయని, నీరు నిల్వ లేదని, దోమలు ఉండేందుకు ఆస్కారం లేదని అధికారులు ప్రకటించారు. చంద్రబాబుతో సహా ఖైదీలందరి ఆరోగ్యం, భద్రత తమ లక్ష్యమని చెప్పారు.


ఎందుకీ దోమల గోల..?

రాజమండ్రి జైలులో ఓ ఖైదీ దోమకాటుతో డెంగ్యూ బారిన పడి మృతి చెందాడని, తన తండ్రిని కూడా అలాగే ప్రభుత్వం మట్టుబెట్టాలని చూస్తోందని నారా లోకేష్ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ పై రకరకాల కామెంట్లు వినపడ్డాయి. శత్రువుల్ని దోమలతో కుట్టించి చంపే టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదని అంటున్నారు నెటిజన్లు. టీడీపీ వాళ్ల ఆరోపణలు చూస్తుంటే, వారి వల్లే జైలులో ఉన్న చంద్రబాబుకి ప్రమాదం పొంచి ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని సెటైర్లు పేల్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో నేరుగా జైలు అధికారులే ఈ వ్యవహారంపై స్పందించడం విశేషం.

రిమాండ్ ఖైదీ మృతి నిజమే.. కానీ..!

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ స‌త్య‌నారాయ‌ణ డెంగ్యూతో మృతి చెందాడనే వార్త నిజమే. అయితే ఆయన డెంగ్యూ బారిన ఎప్పుడు పడ్డారనేదే అసలు ప్రశ్న. స‌త్య‌నారాయ‌ణ అనే ఖైదీని ఈ నెల 6వ తేదీన జైలుకు తీసుకొచ్చారని, ఆరోజు చేసిన స్క్రీనింగ్ టెస్ట్‌ లో అత‌డు జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు తేలింద‌న్నారు అధికారులు. ఆ తర్వాత ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తే చికిత్స పొందుతూ 19న మృతిచెందాడని చెప్పారు. అతడు మృతికి కారణం డెంగ్యూ అయినా కూడా, జైలులో అది సోకలేదని అంటున్నారు. సత్యనారాయణ మృతికి, చంద్రబాబు భద్రతకు పోలిక చెబుతూ విమర్శలు చేయడం సరికాదంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News