ఏపీలో సినిమా రాజకీయం.. 'రాజధాని ఫైల్స్' పై వైసీపీ పిటిషన్
వాస్తవానికి 'రాజధాని ఫైల్స్' సినిమా చిత్రీకరణ సమయంలో కూడా పెద్దగా హడావిడి జరగలేదు. తీరా ట్రైలర్ విడుదలయ్యాక ఎల్లో మీడియా కాస్త అతి చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
ఏపీలో సినిమా రాజకీయాలు మొదలయ్యాయి. వ్యూహం, యాత్ర-2 తో వైరి వర్గంపైకి వైసీపీ బాణాలు సంధిస్తే.. 'రాజధాని ఫైల్స్' అంటూ టీడీపీ బ్యాచ్ ఎదురుదాడికి దిగింది. వీటిలో యాత్ర-2 ఎలాంటి ఆటంకాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. వ్యూహం విషయంలో టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. న్యాయస్థానాల్లో నారా లోకేష్ పిటిషన్ల విచారణ అనంతరం అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈనెల 23న వ్యూహం విడుదలవుతోంది. ఇప్పుడిక 'రాజధాని ఫైల్స్' తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంపై సెటైరిక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
వాస్తవానికి 'రాజధాని ఫైల్స్' సినిమా చిత్రీకరణ సమయంలో కూడా పెద్దగా హడావిడి జరగలేదు. తీరా ట్రైలర్ విడుదలయ్యాక ఎల్లో మీడియా కాస్త అతి చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దీంతో వైసీపీ అలర్ట్ అయింది. 'రాజధాని ఫైల్స్' సినిమా విడుదల ఆపేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ సినిమా తీశారనేది వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఈ సినిమాలో జగన్, కొడాలి నాని, తదితరుల్ని పోలిన పాత్రలున్నాయని.. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ని రద్దు చేయాలని లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్ లో కోరారు.
వ్యూహం సినిమాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పోలిన పాత్రలున్నాయి. వారిని కించపరిచేలా సన్నివేశాలున్నాయి. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ మంత్రులు కూడా హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మ వీరుడు, శూరుడు అంటూ పొగిడారు. ఆ సినిమా విడుదలను లోకేష్ అడ్డుకుంటే.. అంత భయమెందుకంటూ సెటైర్లు పేల్చారు. ఇప్పుడు వైసీపీకి అదే సీన్ ఎదురయ్యే సరికి మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక్కడ ఎవర్నీ తప్పుబట్టాల్సిన పనిలేదు, అదే సమయంలో ఎవరిపై కూడా సింపతీ చూపించాల్సిన అవసరం లేదు. ఏపీ రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడో శృతి మించి బూతుల స్థాయికి దిగజారాయి. నేరుగా తిట్టుకోవడం అయిపోయాక సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు సినిమాలు తీసి మరీ తిట్టుకుంటున్నారు. ఇలాంటి రాజకీయ సినిమాలకు టికెట్లు తెగుతాయని, థియేటర్లు హౌస్ ఫుల్ అవుతాయని అనుకోలేం. కానీ ఎన్నికల ముందు ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయా సినిమాల వ్యవహారం న్యాయస్థానాలకు చేరింది.