పీవీ రమేష్ ఉద్యోగం ఊడింది..

తమ సంస్థలో సలహాదారుగా ఉద్యోగం చేస్తూ ఉండి, ఇంత వివాదాస్పద వ్యక్తిగా తయారైన పీవీ రమేష్ ను ఈరోజు నుంచి తమ ఆఫీస్ కి రావొద్దని, మేఘా యాజమాన్యం చెప్పినట్టుగా తెలుస్తోంది.

Advertisement
Update:2023-09-12 11:01 IST

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఇటీవల కాలంలో రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని మరింత వివాదాస్పదుడయ్యారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించే విషయంలో తెలుగుదేశం కార్యకర్తకన్నా, ఎల్లో మీడియాకన్నా మించిపోయారు. ఆయన నిన్న ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చాలామందికి ఆగ్రహం తెప్పించాయి. సరైన ఆధారాలు లేకుండానే సీఐడీ కేసు నమోదు చేసిందని, చంద్రబాబుని బాధ్యుడిని చేస్తే రాజకీయ వ్యవస్థ కుప్పకూలుతుందని, ఏ ఆధారాలతో ఆయన్ను అరెస్ట్ చేశారని, తన స్థాయికి మించి కామెంట్లు చేశారు. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే చంద్రబాబు బదులుగా అధికారుల్నే బాధ్యుల్ని చేయాల్సి వస్తే అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ కూడా బాధ్యత వహించాలి కదా. మరి ఆ మాత్రం స్పృహ లేకుండా ఆయన ఇంత బాధ్యతారహితంగా మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరచింది.

పీవీ రమేష్ ఉద్యోగం నుంచి రిటైరయ్యాక, మేఘా ఇంజినీరింగ్ సంస్థలో సలహాదారుగా చేరారు. మేఘా యాజమాన్యం అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉంటుంది. ప్రతిపక్షాలతోనూ, అధికార పక్షంతోనూ స్నేహపూర్వకంగా ఉంటుంది. వాళ్ల వ్యాపారాలు, వాళ్ల వ్యవహారాల్లో తప్ప ఏనాడూ రాజకీయ వ్యవహారాల్లో, పార్టీల వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అలాంటిది తమ సంస్థలో సలహాదారుగా ఉద్యోగం చేస్తూ ఉండి, ఇంత వివాదాస్పద వ్యక్తిగా తయారైన పీవీ రమేష్ ను ఈరోజు నుంచి తమ ఆఫీస్ కి రావొద్దని, మేఘా యాజమాన్యం చెప్పినట్టుగా తెలుస్తోంది.

పీవీ రమేష్ ఉద్యోగంలో చేరినప్పటినుంచి కూడా తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. సుజనా చౌదరి ఆర్థిక వ్యవహారాలన్నీ ఈయనే చూసేవారు. అది తెలిసి జగన్ ఈయన్ను వదిలించుకున్నారు. ఆ తర్వాత పీవీ రమేష్ టీడీపీలో బాగా యాక్టివ్ అయిపోయారు. తన సోదరుడికి టీడీపీ అమలాపురం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు రమేష్. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ కార్యకర్తలాగా మాట్లాడటం, ఆయన్ను గురించి బాగా తెలిసినవారెవరికీ ఆశ్చర్యం అనిపించడంలేదు. 


పీవీ రమేష్ కీలకం..

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుపై గతంలో ఆయన సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. అయితే తన స్టేట్ మెంట్ ఆధారంగా చంద్రబాబుని అరెస్ట్ చేయడం సరికాదని ఆయన ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా అప్పుడు అధికారులుగా ఉన్నవారిని (తాను కాకుండా మిగిలిన వారిని) కూడా విచారించాలన్నారు. ఇక్కడ రమేష్ లాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కావడంలేదు. తప్పు జరిగిందని పీవీ రమేష్ పరోక్షంగా ఒప్పుకుంటున్నా, ఆ తప్పుకి చంద్రబాబు బాధ్యుడు కాదు అంటున్నారాయన. అయితే అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పీవీ రమేష్ కూడా ఈ కుట్రలో భాగస్వామి అని ఒప్పుకోవాల్సిందే. ఈ కేసులో పీవీ రమేష్ ని బూచిగా చూపి ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తోంది. ఆయన కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈ వ్యవహారంతో సలహాదారు పదవిలో ఉన్న ఆయన్ను మేఘా సంస్థ పక్కనపెట్టింది. 

Tags:    
Advertisement

Similar News