జగన్ పై డైరెక్ట్ ఎటాక్.. తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే
ఐ ప్యాక్ తరపున సర్వే చేసే వాళ్లు డబ్బులిస్తే నివేదికలు మార్చి ఇచ్చేస్తారని, ఆ సర్వేలను ఎలా ప్రాతిపదిక చేసుకుంటారని నిలదీశారు. ఐదేళ్లపాటు వైసీపీ పెద్దలు చెప్పినట్టే నడచుకున్నా.. తనని తప్పుబట్టడం సరికాదంటున్నారాయన.
ఊహించినట్టే జరుగుతోంది. వైసీపీలో ఇన్ చార్జ్ ల మార్పు అంతర్గత కలహాలకు కారణం అవుతోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లు సైలెంట్ గా పక్కకు తప్పుకున్నారే కానీ జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టలేదు. కానీ పూతలపట్టు ఎమ్మెల్యే అలా కాదు.. తనకు టికెట్ ఇవ్వట్లేదని అధిష్టానం తేల్చి చెప్పగానే ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ని టార్గెట్ చేశారు. దళితులంటే అంత లోకువా అని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలో జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు స్థాన చలనం లేదని, కేవలం దళితుల్నే టార్గెట్ చేస్తున్నారంటూ కొత్త లాజిక్ తీశారు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.
ఆమధ్య సీఎం జగన్ తో జరిగిన భేటీలో కూడా ఆయన ఇలాగే మాట్లాడినట్టు తెలిసింది. పేరుకి తాను ఎమ్మెల్యేనయినా, పెత్తనం అంతా పెద్దిరెడ్డి వర్గం చేతుల్లోనే ఉందని, వారి మాట తానెప్పుడూ జవదాటలేదని చెప్పారట బాబు. అంతా వారికి నచ్చినట్టు చేసినా, చివరకు తనను మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బులిస్తే ఐ ప్యాక్ ఓకే..
ఇక ఎమ్మెల్యేలపై జరుగుతున్న ఐ ప్యాక్ సర్వేలపై కూడా ఎంఎస్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఐ ప్యాక్ తరపున సర్వే చేసే వాళ్లు డబ్బులిస్తే నివేదికలు మార్చి ఇచ్చేస్తారని, ఆ సర్వేలను ఎలా ప్రాతిపదిక చేసుకుంటారని నిలదీశారు. ఐదేళ్లపాటు వైసీపీ పెద్దలు చెప్పినట్టే నడచుకున్నా.. తనని తప్పుబట్టడం సరికాదంటున్నారాయన. తనపై వ్యతిరేకత ఉన్నది నిజమైతే.. అది వైసీపీ పెద్దల వల్లే వచ్చిందని తన సొంత నిర్ణయాలేవీ లేవని కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడే ఏంటిది..?
ఐదేళ్లుగా తప్పులు చేస్తుంటే ఇప్పుడు పిలిచి టికెట్ లేదని చెప్పడమేంటని నిలదీశారు ఎమ్మెల్యే బాబు. ఐదేళ్లలో ఎప్పుడైనా పిలిపించుకుని మాట్లాడారా అని ప్రశ్నించారు. తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు బాబు. అయితే పార్టీని మాత్రం వీడేది లేదంటూ సదరు ఎమ్మెల్యే క్లారిటీ ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. ఈ స్థాయిలో పార్టీతో పంచాయితీ పెట్టుకున్న తర్వాత ఇక ఆయన వైసీపీలో ఉన్నా లేనట్టే అంటున్నారు విశ్లేషకులు.