జీవీల్ కు పురంధేశ్వరి కౌంటర్ ...బీజేపీలో ఎన్టీఆర్ , వైఎస్, Vs రంగా ఫైట్

జీవీఎల్ మాటలపై వైసీపీ నుంచి గానీ, టీడీపీ నుంచి గానీ ఎవరూ మాట్లాడక ముందే బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి స్పందించారు. జీవీఎల్ మాటలను ఖండించారు.

Advertisement
Update:2023-02-17 14:18 IST

ఏపీ బీజేపీ లో ఈ మధ్య‌ కాలంలో రోజుకో రభ‌స నడుస్తోంది. బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, సెటైర్లు వేసుకుంటున్నారు. వారి మధ్య గొడవ పీక్ లెవల్ కు వెళ్ళి చివరకు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసే దాకా వెళ్ళింది. అయినా అక్కడితో గొడవలు ఆగలేదు.

ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ న‌ర్సింహ్మా రావు ఈ మధ్య కాపులను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు. ప్రతిరోజూ కాపులతో మీటింగులు పెట్టడం, కాపు నాయకులతో సన్మానాలు చేయించుకోవడం, వంగవీటి రంగా కు తానే వారసడన్నంతగా మాట్లాడటం పరిపాటిగా మారింది.

తాజాగా ఆయన మాట్లాడుతూ, ''ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రెండు పార్టీలు, ఆ రెండు కుటుంబాలేనా ? అన్నింటికీ వారి (ఎన్టీఆర్, వైఎస్సార్) పేర్లేనా, జిల్లాలకు, పథకాలకు అన్నింటికీ వారి పేర్లేనా ? ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయమన్నది లేదా ? వంగవీటి రంగా పేరు ఎందుకు పెట్టరు ? '' అని ప్రశ్నించారు.

అయితే ఆశ్చర్యంగా జీవీఎల్ మాటలపై  వైసీపీ నుంచి గానీ, టీడీపీ నుంచి గానీ ఎవరూ మాట్లాడక ముందే బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి స్పందించారు. జీవీఎల్ మాటలను ఖండించారు.

జీవీఎల్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసి 'ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు' అని కామెంట్ చేసిన ఆమె వారిద్దరూ తెలుగు ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు.

''ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం-- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరో కరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు'' అని ట్వీట్ చేశారు.

పురంధేశ్వరి ట్వీట్ పై నెటిజనులు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను సపోర్ట్ చేయగా మరి కొందరు బీజేపీ అభిమానులు మాత్రం ఆమె ట్వీట్ ను విమర్శిస్తున్నారు. పార్టీ అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడుతారా అని పలువురు బీజేపీ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News