పురందేశ్వరికి మరో ఎదురు దెబ్బ

పురందేశ్వరి గాలిని కేంద్రమే తీసేస్తోంది. అప్పుల విషయం, ఇళ్ళ నిర్మాణాల విషయంలో ఏమి జరిగిందో అందరూ చూసిందే. తాజాగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అదే జరిగింది.

Advertisement
Update:2023-08-24 11:27 IST

ఏ ముహూర్తంలో దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకన్నారో తెలీదు. బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఆమెకు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఏ విషయంలో అయినా సరే ఆమె ఒకటి చెబితే కేంద్రం మరోటి అంటోంది. అంటే పురందేశ్వరి గాలిని కేంద్రమే తీసేస్తోంది. అప్పుల విషయం, ఇళ్ళ నిర్మాణాల విషయంలో ఏమి జరిగిందో అందరూ చూసిందే. తాజాగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అదే జరిగింది.

ఇంతకీ విషయం ఏమిటంటే మంగళవారం విశాఖపట్నంలో బీజేపీ నూతన కార్యవర్గం సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. ప్లాంటుతో పాటు ఉద్యోగులు, కార్మికులకు ఎలా మేలు చేయాలా అని ఆలోచిస్తున్నట్లు గొప్పగా చెప్పుకున్నారు. ఆమె ఈ మాటలు చెప్పి 24 గంటలు కాకముందే ప్లాంటు రెండేళ్ళకు మించి ఉండదని స్వయంగా ఉక్కు శాఖ కార్యదర్శి ప్రకటించారు.

ప్రకటించటం అంటే సభలో చెప్పటం కాదు రాతపూర్వ‌కంగా చెప్పారు. స్టీల్ ప్లాంటును కార్యదర్శి ఎస్ఎస్ సిన్హా సందర్శించారు. అన్నీ విభాగాలను పరిశీలించిన తర్వాత విజిటర్స్ బుక్‌లో ఏదో రాశారు. ఆయన వెళిపోయిన తర్వాత ఏమి రాశారా అని చదివిన ఉన్నతాధికారులు స్టన్ అయిపోయారు. ఇంతకీ ఆయన ఏమి రాశారంటే ‘విశాఖ స్టీల్ ప్లాంటు రెండేళ్ళల్లో మూతపడనుంది’ అని ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

కొన్ని గంటలపాటు ప్లాంటులోనే ఉన్నతాధికారులతో గడిపిన సిన్హా అప్పుడు ఏమీ చెప్పకుండా విజిటర్స్ బుక్‌లో ఇంత పెద్ద విషయాన్ని రాసి వెళ్ళటం ఏమిటో అర్థంకావటంలేదు. మంగళవారం పురందేశ్వరి చెప్పిన మాటలకు బుధవారం ఉక్కుశాఖ కార్యదర్శి రాసిందానికి పూర్తి విరుద్ధంగా ఉంది. కార్యదర్శి తాజా రాతతో పురందేశ్వరి చెప్పిందంతా అబద్ధమే అని మరోమారు తేలిపోయింది. అప్పులపై చెప్పింది అబద్ధాలే, ఇళ్ళ నిర్మాణంలో చెప్పింది అబద్ధాలే అని గతంలోనే రుజువయ్యాయి. మరి ఎందుకని పురందేశ్వరి పదేపదే అబద్ధాలు చెబుతున్నారో అర్థంకావటంలేదు. జగన్మోహన్ రెడ్డిపై కోపం ఉంటే ఉండచ్చు కానీ లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెబితే జనాలు నమ్ముతారా?


Tags:    
Advertisement

Similar News