పురందేశ్వరికి అంత ధైర్యం లేదా..?

నందమూరి కుటుంబ సభ్యురాలిగా చంద్రబాబుపై సింపతీ చూపించడం మినహా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పొత్తుపై కామెంట్ చేసే ధైర్యం పురందేశ్వరికి లేకపోయింది.

Advertisement
Update:2023-09-17 16:09 IST

ఏపీలో ప్రస్తుతం జనసేన, బీజేపీ అధికారిక పొత్తులో ఉన్నాయి. టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుంటామని ఇటీవలే పవన్ ప్రకటించారు. అంటే మూడు పార్టీలు పొత్తులో ఉన్నట్టే లెక్క. కానీ బీజేపీ అధినాయకత్వం ఈ కూటమికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏపీలో చంద్రబాబుతో కలసి వెళ్లాలన్న ఉద్దేశం వారికి ఏ కోశానా లేదు. అందుకే కనీసం బాబు అరెస్ట్ పై కూడా ఎవరూ స్పందించలేదు. ఢిల్లీలో చక్కర్లు కొడుతున్న లోకేష్ కి ఎవరూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ దశలో నందమూరి కుటుంబ సభ్యురాలిగా చంద్రబాబుపై సింపతీ చూపించడం మినహా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పొత్తుపై కామెంట్ చేసే ధైర్యం పురందేశ్వరికి లేకపోయింది.

చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుగా చూడట్లేదు..

వాస్తవానికి ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలసి పనిచేయాలని పురందేశ్వరి అనుకుంటున్నా పైకి చెప్పలేకపోతున్నారు. ఆ దిశగా తాము అధిష్టానాన్ని ఒప్పిస్తామని చెప్పే సాహసం కూడా ఆమె చేయడంలేదు. పవన్ వ్యాఖ్యల్ని తాము తప్పుగా చూడట్లేదని మాత్రమే ఆమె కవర్ చేస్తున్నారు. పవన్ వెళ్లి బీజేపీ అధిష్టానానికి పరిస్థితి వివరిస్తానన్నారని, ఆ తర్వాత తాము ఈ కూటమి విషయంలో నిర్ణయం తీసుకుంటామని, అంతా అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు పురందేశ్వరి.

నేరుగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని పురందేశ్వరి చెప్పలేకపోతున్నారు. పోనీ టీడీపీతో కలసి వెళ్తే తమ బలం కూడా పెరుగుతుందని చెప్పే ధైర్యం కూడా ఆమెకు లేదు. చంద్రబాబు విషయంలో బీజేపీ అధిష్టానం ఇంకా కోపంగానే ఉందనే విషయం పురందేశ్వరికి తెలుసు. అందుకే ఆమె, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అన్నారే కానీ, బాబు తప్పుచేయలేదని సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు పొత్తు వ్యవహారంపై కూడా అంతా అధిష్టానం చూసుకుంటుందని తేల్చేశారు. పవన్ వ్యాఖ్యల్ని మాత్రం ఖండించలేదు, అలాగని స్వాగతించనూ లేదు. మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి ఆలోచన చేస్తుందో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News